మళ్లీ గరిష్ఠానికి స్టాక్‌ మార్కెట్లు..!

– తొలిసారిగా 11,450 మార్క్‌ ను తాకిన నిఫ్టీ

ముంబయి, ఆగస్టు8(జ‌నం సాక్షి) : దలాల్‌స్టీట్ర్‌ మళ్లీ లాభాల జోరు మొదలుపెట్టింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. బ్యాంక్‌ షేర్లు కళకళలాడటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో సూచీలు మళ్లీ జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ తొలిసారిగా 11,450 మార్క్‌ను తాకింది. నిఫ్టీ బ్యాంక్‌ కూడా మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 28వేల మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బుధవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మదుపర్లు అప్రమత్తత పాటించడంతో తొలి గంటల్లో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అయితే బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో ఒత్తిడిని అధిగమించినసూచీలు రికార్డుల వైపు పరుగులు తీశాయి. ముఖ్యంగా చివరి గంటల్లో కొనుగోళ్లు మార్కెట్‌కు కలిసొచ్చాయి. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు సరికొత్త రికార్డులతో ముగించాయి. నేటి మార్కెట్లో సెన్సెక్స్‌ 222 పాయింట్లు లాభపడి 37,887 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలో స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 11,450 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టీ 186 పాయింట్లు ఎగబాకి 28,062 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.66గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఓఎన్‌జీసీ, రిలయన్స్‌, సిప్లా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడగా.. లుపిన్‌, మారుతి సుజుకీ, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి.

—————————-