మళ్లీ మాటతప్పితే..ఉద్యమం ఉప్పెనైతది

కరీంనగర్‌టౌన్‌, జనవరి 20 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మళ్లీ మాట తప్పితే ఉద్యమం ఉప్పెనైతదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీది నాలుగు దశాబ్దాలుగా మోసపూరిత చరిత్రేనని తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్టానం సమస్యకు పరిష్కారం చూపాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా , సీమాంధ్రులు అడ్డుకునేందుకు అన్ని రకాల యత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఉద్యమకారులు విశ్రాంతి తీసుకుంటే కేంద్రం మళ్లీ వెనక్కి మళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ప్రత్యేకరాష్ట్రం కోరుకుంటున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం పేరుతో సీమాంధ్ర పెట్టుబడిదారిశక్తులు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోజూస్తున్నాయని తెలిపారు. తెలంగాణపై కేంద్రం మాట తప్పితే తర్వాత జరగబోయే పరిణామాలకే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించబోయే సమరదీక్ష తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైనదని, దీనికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కేంద్రం సానుకూలంగా ఉన్నామంటూనే ఎందుకు సాయుధ బలగాలను దించుతుందో తెలియడం లేదన్నారు. ప్రజలు అప్రత్తంగా ఉండాలని, పోరుదారి వీడొద్దని సూచించారు. కార్యక్రమంలో వెంకటమల్లయ్య, డాక్టర్‌ ఎడవల్లి విజేందర్‌రెడ్డి, రవీందర్‌, నల్లాల కనకరాజు, శ్రీనివాస్‌యాదవ్‌, రవి, దుబ్బాక శ్రీనివాస్‌, వరలక్ష్మి, సక్కుబాయి పాల్గొన్నారు.