మళ్లీ రోడ్డెక్కిన మరాఠాలు..

– ప్రశాంతంగా మహారాష్ట్ర బంద్‌
ముంబయి, ఆగస్టు9(జ‌నం సాక్షి) : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠాలు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా గురువారం మహారాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంద్‌ కొనసాగింది. లాతూర్‌, జల్నా, సోలాపూర్‌, బుల్దానా జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేపట్టారు. బస్సులు, వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు బంద్‌ నేపథ్యంలో ముంబయి, పుణె, నాగ్‌పూర్‌లో పోలీసులు అప్రమత్తమై ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో బంద్‌ శాంతియుతంగా కొనసాగింది. ముంబయిలో బంద్‌ ప్రభావం స్వల్పంగానే ఉందని, లోకల్‌ రైళ్లు, బస్సులు అందుబాటులోనే  ఉంచామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని మార్కెట్లు, విద్యాసంస్థలు మాత్రం మూతబడ్డాయి. పుణె, నాగ్‌పూర్‌లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గత నెలలో మరాఠాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో కొందరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం చర్చలకు దిగిరావడంతో మరాఠాలు ఆందోళన విరమించుకున్నారు. రిజర్వేషన్లపై తాము చర్చిస్తున్నామని.. నవంబరు నాటికి డిమాండ్లను పరిష్కరించేలా చూస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ హావిూ ఇచ్చారు. అయినప్పటికీ నేడు మరాఠాలు మళ్లీ ఆందోళన చేపట్టడం గమనార్హం.
———————–