మళ్లీ విద్యుత్‌ కోతలు..

అదిలాబాద్‌, నవంబర్‌ 23 :గత కొద్ది రోజులుగా ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా హాయిగా ఉన్న వినియోగదారులకు మళ్లీ కోతలు తప్పడం లేదు. గత నెల రోజుల నుంచి వినియోగదారులు  విద్యుత్‌ కోతలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ విద్యుత్‌ శాఖ తాజాగా కోతలు విధించడంతో మండిపడుతున్నారు. విద్యుత్‌ వినియోగం పెరగడంతో కోతలు విధించక తప్పడంలేదని అధికారులు ప్రకటించారు. విద్యుత్‌ కోత వేళలను కూడా తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ప్రతి రోజు గంటసేపు, పట్టణాలు, మునిసిపాలిటీల్లో రెండు గంటలసేపు, మండల, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ప్రతిరోజు నాలుగు గంటల పాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్టు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అధికారికంగా వేళలు ప్రకటించినప్పటికీ అనధికారికంగా ఎన్ని గంటలు కోతలు విధిస్తారనే దానిపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, పట్టణాలు, మునిసిపాలిటీల్లో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, మండల, గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ కోత విధించనున్నట్టు వివరించారు. అధికారులు ప్రకటించిన సమయాల్లోనే విద్యుత్‌ కోతలు విధించాలని, మిగిలిన సమయాల్లో విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేయాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు.