మహారాష్ట్రంలో రిజర్వేషన్ల పోరు 

– మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌
– పలుచోట్ల ఉద్రిక్తంగా మారిన బంద్‌
– వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళన కారులు
– ఆందోళన కారులను కట్టడి చేసేందుకు పోలీసులు విఫలయత్నం
ముంబయి, జులై25(జ‌నంసాక్షి) : మహారాష్ట్రలో రిజర్వేషన్ల రగడ రాజుకుంది. మరాఠా సమాజ్‌కు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఓ యువకుడి ఆత్మహత్యకు నిరసనగా ‘మోర్చా’ ఆధ్వర్యంలో బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ సందర్భంగా  ముంబైలో హింస చెలరేగింది. మోర్చా కార్యకర్తలు ఎక్కడికక్కడే ఆందోళనలు నిర్వహించారు. పలువురు ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. లోకల్‌ రైళ్లను అడ్డుకున్నారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్లపై బైఠాయించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఔరంగాబాద్‌లో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మరాఠా వర్గానికి చెందిన వారు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ నేపథ్యంలో ఆందోళనకారులు పలుచోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు థానేలో పలు బస్సులను ధ్వంసం చేశారు. లోకల్‌ రైళ్లను అడ్డుకున్నారు. రహదారులపై టైర్లను తగలపెట్టి వాహనాలను అడ్డుకున్నారు. ఘన్‌ సోలి వద్ద రవాణా బస్సులపై రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. ఉద్రిక్తంగా మారిన బంద్‌ నేపథ్యంలో ఐరోలీ నుంచి వాషి వరకు ప్రభుత్వం బస్సు సర్వీసులను నిలిపివేసింది. బంద్‌ ప్రభావం ముంబయి, ఔరంగాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది.  ఔరంగాబాద్‌ లో అగ్నిమాపక వాహనానికి ఆందోళనాకారులు నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బంద్‌ ప్రభావం ముంబయి నగరంపై తీవ్రంగా పడింది. ప్రజారవాణ స్తంభించిపోయింది. ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో పలువురు ఓలా, ఉబర్‌ క్యాబ్‌ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆ సర్వీసులు కూడా సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తమకు వ్యతిరేకంగా మాట్లాడిన అభ్యంతరకర మాటలకు క్షమాపణ చెప్పాలని మరాఠా క్రాంతి మోర్చా డిమాండ్‌ చేసింది. బంద్‌ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సీనియర్‌ పోలీస్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.