మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

– లోయలోపడ్డ బస్సు.. 32 మంది మృతి
– 800 అడుగుల లోతులో పడి నుజ్జునుజ్జైన బస్సు
– మృతులంతా కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ సిబ్బంది
– క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలింపు
ముంబయి, జులై28(జ‌నం సాక్షి) : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సతారా జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సుమారు 35 మందితో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 32 మంది మృతి మృత్యువాత పడ్డారు. అంబేనలి ఘాట్‌లో పొలందపూర్‌ సవిూపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వీకెండ్‌ కావడంతో కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 33 మంది సిబ్బందితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ మొత్తం మహాబలేశ్వరం విహార యాత్రకు బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యలోనే బస్సు అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. సుమారు 800 అడుగుల లోతులో పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు లోయలో పడేముందే అప్రమత్తమైన ఓ వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలినవారంతా ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి బయటకు వచ్చి అక్కడి స్థానికులకు చెప్పాడు. దీంతో పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చేపట్టారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని మృతుల వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మృతులంతా కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినవారిగా ఆయన వెల్లడించారు. వెలికి తీసిన మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించి వారి బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. మృతుల్లో కొందరు రత్నగిరి, తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. తన కళ్ల ముందు జరిగిన ఈ ఘోర విషాదం నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. ఆయనను విచారించి మృతుల వివరాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. లోయ బాగా లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం నెలకొంది. కొన ఊపిరితో ఉన్న వారికి చికిత్స అందించేందుకు కావాల్సిన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.