మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం
-భరోసా సెంటర్ నిర్మాణంకు భూమి పూజ, శంకుస్థాపన
మహబూబాబాద్, జూలై -15:
బాధితులకు అండగా ఉండి సేవలు అందించి వారి సమస్యల పరిష్కారం చేస్తున్న సందర్భంలో మరింత ఎక్కువగా సేవలు అందించడానికి భరోసా కేంద్రానికి శాశ్వత సొంత భవనం ఉండాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం భూమి పూజ చేసుకొని శంకుస్థాపన చేసుకున్నామని రాష్ట్ర డి.జి.పి. డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆన్లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, గద్వాల్, మహబూబ్ నగర్ (5) జిల్లాల్లో భరోసా సెంటర్ లకు భూమి పూజ, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి భరోసా సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్లైన్ లో విధానంలో డి.జి.పి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భరోసా సెంటర్ ద్వారా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ, వైద్యం, న్యాయ సేవలు అందించి వారిలో భరోసా తో పాటు, నమ్మకాన్ని కలిగించాలని తెలిపారు. ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్న భరోసా సెంటర్ లు త్వరగా పనులు ముగించుకుని సేవలు ప్రారంభించి రాష్ట్రంలో ఇతర సెంటర్ లకు రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు. అంతకుముందు ఆన్లైన్ ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్ అడిషనల్ డి.జి.పి. భరోసా సెంటర్ గురించి వివరించారు. బాధితులకు అండగా ఉండి సమస్యలకు పరిష్కారం చూపడమే భరోసా సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమని, గృహ హింస, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు అండగా నిలవడం, చిన్నారులకు ఆసరాగా ఉండి లైంగిక వేదింపుల నుండి రక్షణ కల్పించడం, బాధితులకు అండగా ఉండి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సెంటర్ లో బాధితుల వెంట చివరి వరకు అండగా ఉండి వైద్య, న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ జిల్లాలో నడుపబడుచున్నదని, శాశ్వత భవనం కలక్టరేట్ కు దగ్గరలో ఏర్పాటు చేసుకుంటున్నా మని, ఈ ప్రాంతంలో భరోసా సెంటర్ ద్వారా
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తామని, జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ఈ సెంటర్ కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, శాంతి భద్రతలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. భరోసా సెంటర్ ఏర్పాటుతో మహిళల సమస్యలు త్వరగా తీరుతాయని, మహిళల కోసం షీ టీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం, డి.ఎస్పీ సదయ్య, ఆర్డీవో కొమురయ్య, డి.ఎం.అండ్ హెచ్. ఓ. హరీష్ రాజ్, డిడబ్ల్యూఓ నర్మద, తహసిల్దార్ నాగభవాని, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొననున్నారు