మహిళాబిల్లు మళ్లీ తుస్సు

ఒక్కరు కూడా పట్టించుకోని వైనం

జీరో అవర్‌లోనూ ప్రస్తావించని మహిళా సభ్యులు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా పార్లమెంట్‌ సమావేశాల తీరు సాగడంతో పాటు ముగిశాయి. అవిశ్వాసం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసామని కాంగ్రెస, టిడిపిలు చంకలు గుద్దు కున్నాయి. కాంగ్రెస్‌ను ఎండగట్టామని ప్రధాని మోడీ ఆనందించారు. కానీ ఈ రెండు పక్షాలూ అసలు విషయాలను మరచిపోయాయి. అనేకానేక సమస్యలపై చిత్తశుద్దిని కనబర్చలేక పోయాయి. ప్రధానంగా త్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదించడంలో ఎవరికి వారు రాజకీయాలు ప్రదర్శించారు. అలాగే ముఖ్యమైన మహిళా రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తీసకుని రావడంలో ఇరు పక్షాలు మహిళలను మోసం చేశాయి. మహిళా పార్లయెంట్‌ సభ్యులు కూడా కనీసంగా జీరో అవర్‌లో అయినా దీనిగురించి ప్రస్తావించలేక పోయారు. మొత్తంగా ఏదో సమావేశాలు ముగిశాయని అనిపించారు. జూలై 18న ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మొత్తం 24 రోజుల్లో పార్లమెంట్‌ సభా కార్యకలాపాలు 18 రోజులు జరగాల్సి ఉంది. కానీ తమిళ నేత కరుణానిధి మృతితో పార్లమెంట్‌ ఉభయసభలు ఒక సెలవు ప్రకటించడంతో 17 రోజులు మాత్రమే సభా కార్యకలాపాలు జరిగాయి. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ, రాజ్యసభ నూతన డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ను ఎన్నికోవడం ఈ

సమావేశాల ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా పెద్దల సభలో ప్రధాని మోడీ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు రికార్డుల నుండి తొలగించడం అసాధారణమైన చర్యగా చూడాలి. ఈ సమావేశాల్లో 22 బిల్లులు ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 21 బిల్లులు ఆమోదం పొందగా రాజ్యసభలో 14 బిల్లులు ఆమోదం పొందాయి. సామాజిక న్యాయానికి సంబంధించిన మూడు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యాంగం(121వ సవరణ) బిల్లు-2018, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ బిల్లు-2018, ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) సరవణ బిల్లు-2018 వంటి ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. ఈ మూడు బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కీలకమైన ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుతోపాటు నాలుగు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నేషనల్‌ స్మోర్ట్‌ యూనివర్శిటీ బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, సాయుధ దళాల ట్రిబ్యునల్‌ (సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదే దశలో మహిళాబిల్లుపై ఎక్కడా చిత్తశుద్ది కానరాలేదు. దేశంలో వరదల పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఎపి పునర్విభజన చట్టం అమలు, కనీస మద్దతు ధర, వ్యవసాయ రంగానికి సవాళ్లు పై చర్చ జరిగింది. వీటితో పాటు అస్సాంలోని జాతీయ పౌరసత్వ రిజిస్టేష్రన్‌(ఎన్‌ఆర్‌సి) తుది ముసాయిదాపై చర్చ జరిగింది. మొత్తంగా అధికారపక్షానిదే పైచేయిగా నిలచింది.