మాజీ ఎంపీ విద్య కన్నుమూత
– గుండెపోటుతో శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం
– రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలుపు
– వాసవ్య పేరిట మహిళా మండలి స్థాపన
– మహిళా అభ్యుదయానికి, పిల్లల సంక్షేమానికి విశేష కృషి చేసిన విద్య
– విద్య పార్దివదేహానికి ప్రముఖుల ఘన నివాళి
– సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– సోమవారం పార్దివదేహానికి అంత్యక్రియలు
విజయవాడ, ఆగస్టు18(జనం సాక్షి) : విజయవాడ లోక్‌సభ మాజీ సభ్యురాలు, సామాజిక కార్యకర్త చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. విజయవాడలోని తన నివాసంలో శనివారం ఉదయం 4గంటలకు హఠాన్మరణం పొందారు. గత కొంతకాలం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, విజయవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఈస్థాయి గుర్తింపు పొందిన మహిళా నేత చెన్నుపాటి విద్యనే.
మహిళాభ్యుదయానికి విశేష కృషి..
సమాజంలో వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలు, అంధ విశ్వసాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తే విద్య. తండ్రి భావాలను పుణికి పుచ్చుకుని వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం లక్ష్యాలుగా వాసవ్య పేరిట మహిళా మండలిని స్థాపించి మహిళాభ్యుదయానికి, పిల్లల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారు. గత ఆదివారం వాసవ్య స్వర్ణోత్సవ వేడుకల్లో వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పాల్గొన్నారు. 1934లో మహాత్మాగాంధీ ప్రతి ఒక్కరికి కనీస విద్య ఉండాలని ప్రచారం చేశారు. విద్యతోనే విజ్ఞానం వస్తుందని, అన్ని విషయాలు తెలుస్తాయని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సంవత్సరంలో జూన్ ఐదో తేదీన గోరా దంపతులకు కుమార్తె పుట్టడంతో ఆమెకు ‘విద్య’ అని నామకరణం చేశారు. విద్య విజయనగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1950లో విజయవాడకు చెందిన చెన్నుపాటి శేషగిరిరావును వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పిలిచి టికెట్ ఇచ్చిన ఇందిర..
1974లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు పోటీ చేయటానికి విద్య అభ్యర్థిత్వం ఖరారైంది. కానీ అప్లికేషన్లో కులం, మతం అనే కాలమ్‌లో ‘నిల్’ అని పెట్టడంతో కాంగ్రెస్ టికెట్టు రాలేదు. దీనిపై ఆగ్రహించిన విద్య ఈ విషయాన్ని ఇందిరా గాంధీ దృష్టికి తీసుకెళ్తారు. ‘కులాలు, మతాలు అవసరం లేని రోజున, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా నా సేవలు కావాల్సినపుడు, నన్ను పిలవండి.. అంతవరకూ నేను ఏ పదవి కోసం, టిక్కెట్టు కోసం దరఖాస్తు చేయను అని ఖరాఖండిగా లేఖ రాసి ఇందిరా గాంధీపై బలమైన ముద్ర వేశారు. అలా మాటకు కట్టుబడి ఏ అభ్యర్థిత్వానికి దరఖాస్తు పెట్టలేదు. అయితే 1979లో ఓ రాత్రి అకస్మాత్తుగా ఇందిరా గాంధీ స్వయానా ఫోన్ చేసి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి కె.ఎల్.రావుపై లక్షపై చిలుకుల ఆధిక్యతతో
ఆమె గెలుపొందారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్‌సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు.
ప్రముఖుల నివాళి..
చెన్నుపాటి విద్య భౌతికకాయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుతో పాటు పలువురు నగర ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నుపాటి విద్య మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంపీగా చెన్నుపాటి విద్య ఎనలేని సేవ చేశారని, మహిళా సంక్షేమానికి, అభ్యుదయానికి పాటుపడ్డారని ప్రశంసించారు.