మార్కెట్‌యార్డు సిబ్బందిని లారీతో ఢీకొట్టిన డ్రైవర్

కరీంనగర్ : కరీంనగర్ బైపాస్ రోడ్డులో విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపైకి లారీ దూసుకెళ్లింది. లారీని ఆపకుండా, అడ్డుకున్న ఇద్దరు ఉద్యోగులపైకి వాహనాన్ని పోనివ్వడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం సుల్తానాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన పత్తి లారీని మార్కెటింగ్ శాఖ చెక్‌పోస్ట్ సిబ్బంది ఆపారు. అయినా డ్రైవర్ లారీని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.

అక్కడే ఉన్న కొండయ్య, నరేందర్ అనే ఉద్యోగులు బైక్‌పై లారీని వెంబడించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత లారీని అధిగమించి అడ్డుగా నించున్నారు. డ్రైవర్ లారీని వారిపైకి పోనిచ్చాడు. దీంతో గాయపడిన ఇద్దరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందాడు. లారీతోపాటు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి లారీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. శ్రీరామ్‌పూర్ కాలనీలో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు.