మాల్యాను భారత్ కు పంపించం: యూకే
దిల్లీ: వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్ స్పష్టం చేసింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఇటీవల యూకే ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీలోని బ్రిటన్ హై కమిషన్‌కు కేంద్ర విదేశాంగశాఖ లేఖ రాసింది. అయితే భారత ప్రతిపాదనను యూకే ప్రభుత్వం తిరస్కరించింది. పాస్‌పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.
పలు బ్యాంకులకు దాదాపు రూ. 9వేల కోట్ల ఎగవేసినట్లు మాల్యాపై ఆరోపణలున్నాయి. అయితే గత మార్చిలో మాల్యా గుట్టుచప్పుడు కాకుండా లండన్ వెళ్లిపోయారు. తిరిగి భారత్‌కు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా.. మాల్యా స్పందించలేదు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసింది. ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మరోవైపు దీనిపై మాల్యా భిన్నంగా స్పందిస్తున్నారు. పాస్‌పోర్టు రద్దు చేసి, అరెస్టు చేస్తే తన నుంచి ఎలాంటి డబ్బులు వసూలు కావని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.