మాస్కోలో ఘోర ప్రమాదం

మంటలు ఆర్పడానికెళ్లి.. 8 మంది మృతి

మాస్కో: రష్యా రాజధాని మాస్కో నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాస్కో తూర్పు ప్రాంతంలోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడానికి వెళ్లారు. విధినిర్వహణలో ఉన్న ఆ సిబ్బందిలో 8 మంది మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్లాస్టిక్‌ వస్తువులు ఉన్న గిడ్డంగిలో గురువారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున మంటలు ప్రారంభంకాగా.. అగ్నిమాపక సిబ్బంది అదుపుచేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు మాస్కో అత్యవసర విభాగం మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. గిడ్డంగి నుంచి రాత్రి వంద మంది కార్మికులను సురక్షితంగా ఖాళీ చేయించారు. భవనం కూలడంతో.. మంటలు ఆర్పడానికి భవనంపైకి ఎక్కిన అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.