మా వస్తువులు బహిష్కరిస్తే మా పెట్టుబడులు కూడా వెనక్కుపోతాయి

55555

– భారత్‌కు చైనా వార్నింగ్‌

బీజింగ్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి):పొరుగుదేశం చైనా గురువారం భారత్‌ను తీవ్రంగా హెచ్చరించింది. భారత్‌లో తన వస్తువుల అమ్మకాన్ని బహిష్కరిస్తే.. అది ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఇరుదేశాల పరస్పర పెట్టుబడులను ఇది దెబ్బతీస్తుందని పేర్కొంది.’భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్న చైనీస్‌ కంపెనీలపై వస్తుబహిష్కరణ ప్రభావం పడుతుంది. ఇరుదేశాల సంబంధాలపైనా ప్రభావం ఉంటుంది. దానిని ఇరుదేశాల ప్రజలూ కోరుకోవడం లేదు’ అని న్యూఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్‌ పేర్కొన్నారు. దక్షిణాసియాలో చైనాకు భారతే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంతేకాకుండా చైనా అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉంది.అయితే, చైనా దాయాది పాకిస్థాన్‌కు కొమ్ముకాస్తుండటం.. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు అడుగడుగున మోకాలడ్డుతుండటంతో దేశంలో చైనా వస్తువులపై వ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. చైనా వస్తువులను స్వచ్ఛందంగా బహిష్కరించాలనే పిలుపు సోషల్‌ విూడియాలో తీవ్రస్థాయిలో ప్రచారమవుతోంది. ఈ ప్రభావం దీపావళి సందర్భంగా చైనా టపాసులపై భారీగానే చూపుతోంది. అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించినా.. స్వచ్ఛందంగా చైనా వస్తువుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే, ఈ బహిష్కరణ పిలుపుతో బెంబేలెత్తుతున్న చైనా.. ఇలాంటి చర్య సరికాదని, ఇది భారత్‌-చైనా సంబంధాలను దెబ్బతీస్తోందని పరోక్ష హెచ్చరికలు చేస్తోంది