మిలిటెంట్‌ పోరాటానికే జేఏసీ మొగ్గు

– ఫిబ్రవరిలో చలో అసెంబ్లీ
– మార్చ్‌ తరహాలో పోరాటం
– సీమాంధ్ర పార్టీలు, ఢిల్లీ పెద్దలే లక్ష్యంగా ఉద్యమం
– డిసెంబర్‌ 9న పెద్ద ఎత్తున నిరసనలు
హైదరాబాద్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధనకు మిలిటెంట్‌ తరహాలో పోరాటానికి టీ జేఏసీ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేసి, విరామం లేకుండా పోరాడాలని భాగస్వామ్య పక్షాలకు ఇప్పటికే సంకేతాలు పంపింది. డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయడం, సీమాంధ్ర ప్రాంత నేతల స్పాన్సర్డ్‌ ఉద్యమంతో వెనక్కు తగ్గి అదే నెల 23న మలి ప్రకటన చేయడంతో ఈ ప్రాంత ప్రజలు భగ్గుమన్నారు. నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని గద్దల్లా తన్నుకుపోయిన సీమాంధ్ర పెట్టుబడిదారుల తీరును ఈ ప్రాంత ప్రజల తీవ్రంగా నిరసించారు. సమస్య పరిష్కారానికికంటూ కేంద్రం వేసిన శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటును జేఏసీ ఆధ్వర్యంలో వ్యతిరేకించారు. కమిటీ పర్యటించిన ప్రాంతాల్లో నిరసన తెలుపుతూనే ప్రజల మనోభావాలు వారి దృష్టికి
తీసుకెళ్లారు. శ్రీకృష్ణ కమిటీ సూచించిన పరిష్కారాలను ముందే ఊహించిన జేఏసీ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు రాజీనామా చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు మాత్రమే జేఏసీ పిలుపునకు స్పందించగా వారిని ప్రజలు కనీవినీ ఎరుగని మెజార్టీతో గెలిపించారు. టీఆర్‌ఎస్‌తో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో నిర్వహించిన తెలంగాణమార్చ్‌ పెద్ద ఎత్తున సక్సెస్‌ అయింది. మార్చ్‌కు కిరణ్‌ సర్కారు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి హైదరాబాద్‌కు వస్తున్న వారిని అడుగడుగునా అడ్డుకుంది. అయినా సాగరహారం పెద్ద ఎత్తున సక్సెస్‌ అయింది. అనంతరం జేఏసీ వరుస కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తోంది. శనివారం జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించనుంది. మార్చ్‌ తరహాలోనే ఫిబ్రవరిలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ సత్తా చాటాలని పథక రచన సాగిస్తోంది. కళ్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్న సీమాంధ్ర పార్టీలు, తలో మాట చెబుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్న యూపీఏ పెద్దలే సమక్షంగా ఉద్యమం ఉధృతం చేయనున్నారు. కేంద్రం ప్రకటన చేసిన డిసెంబర్‌ 9న కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలపనుంది. మొత్తం మీద ఉద్యమ ఉధృతిపై జేఏసీ దృష్టి సారించడంతో సీమాంధ్ర పార్టీల్లోనే తెలంగాణ ప్రాంత నేతలకు గుబులు మొదలైంది.