మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ సుందరి

666మిస్ యూనివర్స్-2015 కిరిటాన్ని ఫిలిప్పీన్స్‌కు చెందిన పియా అలోంజో వర్ట్స్‌బ్యాచ్ సొంతం చేసుకొన్నారు. పియాకు ఈ కిరీటం దక్కడానికి ముందు పోటీలో గందరగోళం చోటుచేసుకున్నది. మిస్ యూనివర్స్ పోటీలలో మొదటి రెండు స్థానాలకు చేరుకొన్న ఇద్దరి మధ్య విశ్వసుందరి కిరీటం దోబూచులాడింది. హోస్ట్ స్టీవ్ హార్వీ పొరపాటుగా మిస్ యూనివర్స్‌గా రన్నరప్‌గా నిలిచిన మిస్ కొలంబియాను విజేతగా ప్రకటించారు. దాంతో మిస్ కొలంబియా ఆరియాడ్నా గుటీర్రెజ్ కండ్లల్లో మెరుపులు మిలమిల మెరిశాయి. ఆనందం సముద్రంలా ఉప్పొంగింది. సంప్రదాయం ప్రకారం ఆరియాడ్నాకు కిరీటం తొడిగారు. పుష్ఫగుచ్ఛాలు అందజేశారు. అయితే ఆరియాడ్నాలో ఆ ఆనందం, మెరుపులు ఎంతోసేపు నిలువలేదు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో హోస్ట్ తన పొరపాటును గ్రహించారు. వెంటనే సర్దుకొని మళ్లీ మిస్ ఫిలిప్పీన్స్ పియాను మిస్ యూనివర్స్‌గా ప్రకటించి తన తప్పును సరిదిద్దుకున్నారు. ఇంక ఏముంది మిస్ కొలంబియా తలమీద నుంచి కిరీటాన్ని తీసి మళ్లీ మిస్ ఫిలిప్పీన్స్‌కు తొడిగి అసలు విజేతను సన్మానించారు. ఇదంతా జరుగుతున్న సేపు వర్ట్స్‌బ్యాచ్ నోటమాట రాక షాక్‌కు గురైంది. ఎట్టకేలకు తనకు విశ్వసుందరి కిరీటం దక్కడంతో పియా ఆనందంతో గంతులేసింది. విశ్వసుందరి పేరును ప్రకటించడంలో తప్పు జరిగిందని, అందుకు తనదే బాధ్యత అని హోస్ట్ స్టీవ్ హార్వీ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో హార్వీ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు 70 వేల సార్లు రీట్వీట్ చేశారు. ఈ పోటీలలో 80 దేశాలకు చెందిన 19 నుంచి 27లోపు వయస్సు ఉన్న యువతులు పాల్గొన్నారు. విశ్వసుందరి ఎంపికకు నియమించిన నలుగురు జడ్జీలతోపాటు టీవీ వీక్షకుల ఓటును కూడా పరిగణనలోకి తీసుకొన్నారు.