మీరు కులగణన చేస్తే..రాహుల్ కులం చెబుతారు
` బిజెపి విమర్శలకు పిసిసి చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
హైదరాబాద్(జనంసాక్షి):ప్రధాని మోడీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ కామెంట్స్‌కు బీజేపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. మోడీ కులం గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతమో చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.శనివారం ఆయన గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు బట్టేబాజ్ మాటలు మాట్లాడ్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం తూటాలకు బలై ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులానికి అతీతంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే.. దేశ వ్యాప్తంగా కులగణన చేసి బీసీల పట్ల కేంద్రానిది స్టాండ్ ఏందో చెప్పండి.. అప్పుడు రాహుల్ గాంధీ కులం గురించి చెబుతారని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ కులం అడగడం ఎందుకు..? బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన చేయిస్తే.. రాహుల్ గాంధీనే ఆయన కులం ఏదో చెప్తారు. రాహుల్ గాంధీనే సర్వేకి వెళ్ళిన వారికి సంతకం పెట్టి మరీ ఆయన కులం, మతం ఏంటో చెప్తారు. దమ్ముంటే దేశవ్యాప్తంగా కుల గణన చేయండి‘ అని బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ ఛాలెంజ్ విసిరారు. ప్రధాని మోడీ బీసీ కాదని.. హాట్ కామెంట్స్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన సీఎం అయ్యాక మోడీ కులాన్ని బీసీలో కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు.