మీ-సేవా కేంద్రాలలో అక్రమాలు
ఆదిలాబాద్, నవంబర్ 10 : ప్రజలు రోజుల తరబడి నిరీక్షించకుండా అవసరమైన సమయాల్లో ధృవీకరణ పత్రాలు అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మీ-సేవా కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్య కారణంగా ప్రజలకు అందడం లేదు. జిల్లావ్యాప్తంగా 106 మీ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మీ-సేవా కేంద్రాలు మంజూరైనప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మీ-సేవా కేంద్రాలు నాంకే వాస్తే మారాయి. మీ సేవా నిర్వహకులు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా సృష్టిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరక మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, పరికరాలు ఉంటేనే మీ-సేవా కేంద్రానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వీరుద్దంగా జిల్లాలో ఎలాంటి పరికరం లేకుండా కేవలం బోర్డులు పెట్టి కేంద్రాలను నిర్వహిస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. అనేక ప్రాంతాలలో మీ-సేవా కేంద్రాలలో సౌకర్యాలు లేనప్పటికీ కేంద్రాల నిర్వహణకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక ప్రాంతాలలో మీ-సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎప్పుడు మూసి ఉంటున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం కష్టాలు పడుతున్నారు. ప్రతి మీ-సేవా కేంద్రానికి వ్యక్తిగతంగా మేలైడి, సంప్రదించడానికి సెల్‌నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అనేక మీ సేవా కేంద్రాలు మేలైడిలు, సెల్‌నంబర్లు ఒకేలా ఉంటున్నాయి. కేవలం మొక్కుబడిగా మీ-సేవా కేంద్రాలను నిర్వహకులు ఏర్పాటు చేసిన ప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు సేవలు పొందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందేలా చూడాలని వారు కోరుతున్నారు.