ముంపులో కోనసీమ లంక గ్రామాలు
బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్ల అప్రమత్తం
రాజమహేంద్రవరం,ఆగస్ట్17(జనం సాక్షి ):ధవళేశ్వరం వరద నీటి ఉధృతిని పర్యవేక్షించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.ధవళేశ్వరం ఉధృతిని బట్టి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో నుంచి చేరుతున్న భారీ వరదనీరు కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరుగుతోందని, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తగిన సహాయక చర్యలకు అధికారులను సిద్ధం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆదేశించింది. పలు గ్రామాలకు వెళ్లే రహదారులు వరద నీటిలో మునిగిపోవడంతో ఆ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే వాగులకు వరద నీరు పొటెత్తడంతో కాజ్ వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం దగ్గర కనకాయలంక కాజ్‌వే వరద నీటిలో మునిగిపోయింది. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పంటపొలాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ఇక దేవీపట్నం మండలంలో కూడా వరద నీటిలో రహదారులు నీట మునగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయడంతో తూర్పుగోదావరి జిల్లాకోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. చాకలిపాలెం వద్ద కాజ్‌వే వరదనీటిలో మునిగిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. సాయంత్రానికి వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. బూరుగులంక, ఊడుమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, పొట్టిలంక తదితర లంకగ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ముక్తేశ్వరం వద్ద తొగరిపాయ పోటెత్తి ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలం చాకలపాలెం వద్ద కాజ్ వే వరద నీటిలో మునిగి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద పోటు కారణంగా కోటిపల్లి-నర్సాపురం రైల్వే పనులకు ఆటంకం ఏర్పడింది. విలీన మండలాల్లో శబరి నది కూడా ఉప్పొంగుతోంది. చింతూరు, వి.ఆర్.పురం మండలాల్లో వరద నీరు రహదారులపై ప్రవహించడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చింతూరు మండలం చెట్టి వద్ద వరదనీరు రహదారిపై ప్రవహించడంతో ఆంధప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ రాష్టాల్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో సీతపల్లివాగు ఉద్ధృతితో మండలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి ఉగ్రరూపంతో గిరిజన గూడేల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.