ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ముంబై,జూలై8( జనం సాక్షి): ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల పాటు ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జులై 8 మధ్యాహ్నం1 గంట నుంచి..జులై 9 మధ్యాహ్నం 1 వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడిరచింది. గంటకు 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహారాష్ట్రతో పాటు ఒడిశా, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, పుదుచ్చేరిలో మాహె నగరం, కోస్తా ఆంధ్రా, యానాం, తెలంగాణ, కర్ణాటకతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడిరచింది.
ముంబై, థానేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ముంబై వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జులై 10 వరకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.