ముక్కోటికి ముస్తాబైన తిరుమల

తిరుమల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తిరుమల దివ్యక్షేత్రం ముస్తాబైంది. విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరణలు అలవైకుంఠపురిని తలపిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజున వేకువ జామున చక్రస్నానం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేసి పునీతులు కావాలనే భక్తిభావంతో లక్షలాదిగా తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో టిటిడి వీరి కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేకువజామునే తిరుప్పావై పఠనంతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాసం కైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈలోపు వైకుంఠ ద్వారాలను శాస్తోక్తంగా తీయనున్నారు. ఉదయం 5 గంటల అనంతరం ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు వీఐపీ దర్శనం ప్రారంభించి ఉదయం 7 గంటల నుంచి ధర్మదర్శనాన్ని ఆరంభించాలని తితిదే ఉన్నతాధికారులు నిర్ణయించారు. వైకుంఠం-2లోని అన్ని కపార్ట్‌మెంట్లు నిండిన అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా నిర్మించిన కంపార్ట్‌
మెంట్లలో యాత్రికులను నింపనున్నారు. అనంతరం నూతనంగా 4 కిలోవిూటర్ల పొడవున రెండు వరుసల్లో నిర్మించిన క్యూలైన్లలోకి అనుమతించనున్నారు.తిరుమలకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు రానున్నట్లు తితిదేకు సమాచారం అందింది. వీరి కోసం గదులను రిజర్వు చేసి సిద్ధంగా ఉంచారు. స్వయంగా వచ్చే ప్రముఖులను గుర్తించి వారికి గదులు, టిక్కెట్లు కేటాయించడానికి తితిదే ఏర్పాట్లు సిద్ధం చేసింది. గురువారం నుంచి నూతన సంవత్సరం జనవరి 1 వరకు శ్రీవారికి అన్ని ఆర్జిత సేవలతో పాటు తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. తిరుమలకు అశేష సంలో తరలివచ్చే భక్తులకు అన్నపానీయాలు ముమ్మరంగా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో దాదాపు 30 గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. పర్వదినాల ఏర్పాట్లను తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.