ముక్కోటి రోజే వైకుంఠ ద్వార దర్శనం 

వైష్ణవ ఆలాయల్లో దర్శన సందడి
తిరుమల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ
ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం మోక్ష ద్వారమని ప్రతీతి. అది ఆ ఒక్క రోజే తెరుచుకుంటుంది. దాన్ని ‘వైకుంఠ ద్వారం’ అంటారు. తిరుమలలో వైకుంఠద్వార ప్రవేశానికి భక్తులు ఉవ్విళ్లూరుతారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక, దీనికి వైకుంఠ ఏకాదశి అన్న ప్రసిద్ధి ఏర్పడింది. దాదాపుగా అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు ఉవ్వీళ్లూరుతారు. తిరుమల, భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, తమిళనాడులోని శ్రీరంగనాథ క్షేత్రం ఇలా వైష్ణవ క్షేత్రాల్లో భక్తుల సందడి ఉంటుంది. మానవుల కాలమానం లెక్కల్లోని మన ఆరునెలల కాలం, దేవతలకు ఒక పగలుతో సమానం. తక్కిన ఆరు నెలలూ దేవతలకు ఒక రాత్రి. ఆషాఢ మాసంలో, అంటే దక్షిణాయనంతో మొదలయ్యే చీకట్ల నుంచి దేవతలు విముక్తులై ఈ ఏకాదశితో వెలుతురులోకి ప్రవేశిస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలానికి దీన్ని శుభారంభ తిథిగా భావిస్తారు.మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత.హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని హరి వాసరంగా వ్యవహరిస్తారు. ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’ అనే మరో పేరు పురాణ గాథ అనుసరించి ఏర్పడింది. ఆషాఢ బహుళ ఏకాదశి- కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి  లేదా లలిత ఏకాదశి అంటారు. రెండోది, అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి. ఏకాదశులన్నీ ప్రత్యేకమైనవే అయినా విధివిధానాలు, పురాణ గాథలను అనుసరించి కొన్ని ఏకాదశులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాతుర్మాస్య దీక్షలకు ఆరంభదినం కాబట్టి, ఆషాఢమాస ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. యోగనిద్ర ముగించి శ్రీమహావిష్ణువు మేలుకుంటాడన్న గాథ ప్రకారం ‘కార్తికమాస ఉత్థాన ఏకాదశి’గా భావిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ధనుర్మాస ముక్కోటి ఏకాదశిని- ‘నిర్ణయ సింధువు’ వంటి గ్రంథాలు మరీ విశేషమైనవిగా వర్ణిస్తున్నాయి. ఇంతటి ఘనత వహించిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియమంతో సాకారం చేసుకోవాలి.