ముఖ్యమంత్రి చంద్రబాబుతో..

ప్రతిభాభారతి భేటీ
– నియోజకవర్గ సమస్యలపై సీఎంతో చర్చ
– కొండ్రు మురళి చేరికపై బాబు వద్ద ప్రస్తావన
– విూకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని బాబు హావిూ
అమరావతి, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజాం నియోజకవర్గంలోని పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో గ్రూపులు కట్టేలా కొందరు ప్రొత్సహిస్తున్నారని బాబుకు ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనికితోడు మాజీ మంత్రి కొండ్రు మురళి పార్టీలో చేరిక అంశంపై చంద్రబాబు వద్ద ప్రతిభా భారతి ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దీంతో స్పందించిన చంద్రబాబు పార్టీ బలోపేతం కోసం చేరికలు ఉంటాయని స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీలో ఎవరు చేరినా విూకు అత్యంత ప్రాధాన్యత ఉందని, అది ఏ మాత్రం తగ్గదని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు, చంద్రబాబు భరోసాతో తాను సంతృప్తిగా ఉన్నట్లు ఆమె విూడియాకు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. స్రతిభా భారతి ఏపీ రాజకీయాల్లో సముచిత స్థానం సంపాదించుకున్నారు. ఉమ్మడి ఏపీ శాసనసభా మొదటి మహిళా స్పీకర్‌గా రికార్డు నెలకొల్పారు. 1999 నుంచి 2004 వరకు స్పీకర్‌గా పనిచేశారు. 1983 నుంచి 85వరకు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా, 1994 నుంచి 1998 వరకు ఉన్నత విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు.

తాజావార్తలు