ముగిసిన డాలర్ శేషాద్రి అంత్యక్రియలు
పార్థివదేహం వద్ద నివాళి అర్పించిన సిజె జస్టిస్ రమణ
పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన
తిరుపతి,నవంబర్30((జనం సాక్షి)): తిరుమల,తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన పార్థివ దేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులు ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతిలోని ఆయన నివాసానికి తరిలించారు. మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శేషాద్రి నివాసానికి వెళ్లారు.అనంతరం ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుఛ్చాలు ఉంచి నివాళి అర్పించారు. డాలర్ శేషాద్రితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబానికి తీర్చలేని నష్టమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతి వచ్చిన ఆయన శేషాద్రి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ శేషాద్రి స్వామి ఇక లేరన్నది నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన లేకుండా తిరుమలకు రావడం ఉహించలేనిదన్నారు. శ్రీవారి సేవలో ఉండగానే చివరి శ్వాస విడవాలని ఆయన సంకల్పం.. అలాగే విధుల్లో ఉంటూ ప్రాణం విడిచారన్నారు. దేవుడి సేవలో ఉంటూనే శ్వాస విడవటం శేషాద్రి అదృష్టమన్నారు. శేషాద్రి స్వామి ఆలయ నిర్వహణపై రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని ఎన్వీ రమణ సూచించారు. ఆయనకు భగవంతుడు స్వర్గ ప్రాప్తి కల్పించాలని స్వామిని వేడుకున్నారు.సీజేఐ వెంట తెలంగాణ ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా స్వామివారికి అంకితమై సేవలందించారని అన్నారు.అనారోగ్య సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా సేవలు అందించారని , శేషాద్రి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన వెల్లడిరచారు. డాలర్ శేషాద్రి అంత్యక్రియలు తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన భౌతిక కాయాన్ని ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి,భూమనకరుణాకర్ రెడ్డి,జెఇవో ధర్మారెడ్డిలో మోసారు. అంత్యక్రియలకు ఇవో జవహర్ రెడ్డి, ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు కూడా హాజరయ్యారు. వేద మంత్రోఛ్చారణ మధ్య అంతిమకర్మ నిర్వహించారు. ఆయకు అంతిమ నివాళి అర్పించడానికి భారీగా సామాన్యులు కూడా తరలివచ్చారు.