ముద్ర బ్యాంకును ప్రారంభించిన ప్రధాని మోదీ

o6wsl8n6న్యూఢిల్లీ:  ద మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర బ్యాంకు)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.  5.77 కోట్లమంది ఉన్న చిన్న వ్యాపారులకు ముద్రా బ్యాంకు నుంచి ప్రయోజనం ఉందన్నారు. పెద్ద పరిశ్రమలు 1.25 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 12 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయని మోదీ తెలిపారు. ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.

కాగా ముద్ర బ్యాంకు చిన్న పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించనుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 5.77 కోట్ల చిన్నచిన్న వ్యాపార యూనిట్లు ఉన్నాయి. అలాగే ఈ బ్యాంకు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు నియంత్రణ బ్యాంకుగా వ్యవహరించనుంది. ముద్ర బ్యాంకును రూ.20వేల కోట్ల కార్పస్ ఫండ్తో, రూ.3వేల కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్తో ఏర్పాటు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ గత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.