మున్సిపల్‌ కార్మికల హావిూలు నెరవేర్చాలి

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ సంస్థలకు గుత్తాధికారం కట్టబెట్టేందుకు 279 జీఓను తెచ్చారని సిఐటియూ నేతలు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించి, 279 జిఒను రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలోని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌  మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు  డిమాండ్‌ చేశారు. సిఐటియు, యూనియన్‌ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య గతంలో జరిగిన చర్చల్లో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు రాతపూర్వకంగా హావిూ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించబోమని, 151 జిఒ ప్రకారం పెరిగిన జీతాలు చెల్లిస్తామని, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారని తెలిపారు. అయితే పారిశుధ్య కార్మికుల పొట్ట గొట్టే 279 జీఓను వెంటనే రద్దు చేయాలని, జీఓ నెంబరు 151 ప్రకారం వేతనాలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేసివుంటే సమ్మెబాట పట్టాల్సిన అవసరం ఏముంటుందన్నారు. కార్మికులందరికీ కనీస వేతనాలు, భద్రత సౌకర్యాలు, పనిముట్లు సకాలంలో అందిస్తామని, హెల్త్‌ కార్డులను, తదితర హావిూలను ప్రభుత్వం రాతపూర్వకంగా హావిూ ఇచ్చి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హావిూ నెరవేర్చలేదన్నారు.