మూకదాడులపై కమిటీ చర్చ

 

న్యూఢిల్లీ,జూలై28(జ‌నం సాక్షి): మూకదాడులను నివారించడానికి కొత్తచట్టాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర ¬ంశాఖ సహాయ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలోని కమిటీ తెలిపింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మూకదాడుల్ని నివారించడానికి అనువైన చట్టాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం సమావేశమైన ఈ కమిటీ, శనివారం కూడా ఈ అంశంపై సమావేశం అయ్యింది. దేశ వ్యాప్తంగా నమోదైన మూకదాడుల కేసులపై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే కమిటీ సభ్యుల నుండి సలహాల్ని తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి)లో మార్పులు చేయాలని సూచించినట్లు తెలిపారు. సాధారణంగా మూకదాడులను సిఆర్‌పిసిలోని సెక్షన్‌ 223(ఎ) కింద విచారిస్తున్నారని, అయితే ఈ చట్టం ఇటువంటి కేసుల్ని విచారించేందుకు అనువుగా లేదని, దీనికోసం సరికొత్త చట్టాన్ని రూపొందించాలని న్యాయవాదులు సూచించారు.