మూడు రాజధానుల బిల్లు వెనక్కిఅసెంబ్లీలో సిఎం జగన్ కీలక ప్రకటన
ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారుకోర్టు కేసులతో ఉన్నత ఆశాయాన్ని దెబ్బతీసేయత్నం చేశారు
రాజధాని అభివృద్దికి లక్షకోట్లు అని చంద్రబాబు లెక్కలేశారు
సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో మళ్లీ సభముందుకు వస్తాం
అసెంబ్లీలో సమగ్ర ప్రకటన చేసిన సిఎం జగన్
అమరావతి,నవంబర్22(జనం సాక్షి):
ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు.ఏ ఉద్దేశ్యంతో మూడు రాజధానులు ప్రతిపాదించామో..అది నెరరవేర్చకుండా అడ్డుకుంటూ, అపోహలు సృష్టించడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు. అయితే తమ ఆలోచనలకు అనుగుణంగా రాజధానుల బిల్లును మెరుగుపరిచి మళ్లీ సభముందుకు వస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు తెలిపిన లెక్కల ప్రకారం అమరావతి మౌళిక వసతుల కల్పనతదితర నిర్మాణానికి లక్షకోట్లు కావాలని. అది సాధ్యమా అని ప్రశ్నించారు. అభివృద్ది చెందిన విశాఖను కొంత మెరుగు పరిచి ఉంటే మంచి రాజధాని అయ్యేదన్నారు. కనీస వసతుల కల్పనకు అంత డబ్బులేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేశాం. రాజధానిపై మా నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారు. వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టాం. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. సమగ్రమై బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈసారి బిల్లు పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతుకుముందు మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న అనంతరం సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఆస్తులన్నీ సీఆర్డీఏకే బదలాయిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అలాగే ఏఎంఆర్డీఐకి బదిలీ చేసిన ఆస్తులు, ఉద్యోగులు యథావిధిగా సీఆర్డీఏకి కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీఆర్డీఏ చట్టం 2014 పునరుద్ధరించినట్లు వెల్లడిరచారు. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడానికి సిద్ధమయ్యాక ఈ విషయాన్ని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. సీఆర్డీయే రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసిందన్నారు. మొత్తానికి మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. త్వరలోనే సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకు వస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడిరది.రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కనీస వసతులకు ఎకరానికి 2 కోట్లు అవుతాయని సీఎం జగన్ తెలిపారు. 50 వేల ఎకరాలకు లక్ష కోట్లు ఖర్చు అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని అన్నారు. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. చంద్రబాబుది ఊహాజనిత రాజధాని మాత్రమే అని.. బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అన్ని రాష్టాల్రు వికేంద్రీ కరణకే ప్రాధాన్యత ఇచ్చాయని బుగ్గన పేర్కొన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే.. వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో పాటు.. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. మొత్తంగా విశృాఖపై సిఎం జగన్ పట్టుదలగా ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. అలాగే మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు.