మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగాఎన్నికల పోలింగ్‌

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్‌ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్‌ ముగియనుంది. మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పటిష్ట భద్రత మధ్య ఓటింగ్‌ కొనసాగుతున్నది.

ఉదయం 9 గంటల వరకు గోవాలో 11.04 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 9.45 శాతం, ఉత్తరాఖండ్‌లో 5.15 శాతం ఓటింగ్‌ నమోదయింది. యూపీ, గోవాలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియనుండగా, దేవభూమి ఉత్తరాఖండ్‌లో సాయంత్రం 5 గంటలవరకు ఓటింగ్‌ జరగనుంది.

గోవా‌లోని 40 స్థానాలోని 301 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. మొత్తం 11,56,464 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 632 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 82,38,187 మంది ఓటర్లు వీరి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఇక ఉత్తరప్రదేశ్‌లో రెండో విడు‌తలో భాగంగా 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతున్నది. ఎన్నికల్లో 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.