మూడోరోజుకు చేరిన అరబిందో ఆందోళన

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం

శ్రీకాకుళం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి అరబిందో కార్మికులు చేపట్టిన సామూహిక సత్యాగ్రహం శనివారంతో మూడవ రోజుకు చేరింది. అరబిందో కార్మికుల వేతన డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు యాజమాన్యాన్ని హెచ్చరించారు. శనివారం వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పైడి భీమవరంలో మౌన సత్యాగ్రహ దీక్షను డి.గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికులుగానే కొనసాగించడం దుర్మార్గమన్నారు. కార్మికులందరినీ రెగ్యులైజేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ యాజమాన్యానికి ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా వేతన ఒప్పందం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అండతో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పెట్రోల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలకు తగ్గట్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.తేజేశ్వరరావు, హెచ్‌.అమ్మనాయుడు, అరబిందో ఫార్మా వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.గురునాయుడు, ఎస్‌.సీతారామరాజు, బి.తిరుపతమ్మ, కె.లక్ష్మి, బి.సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు