మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు కాల్పులు ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుండగుడు ఆ ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా,.. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దిన్‌లోని ఈ -బ్లాక్‌లో సద్మాని అనే మహిళ నివాసం ఉంటోంది. తన ఇంటికి పక్కనే ఉంటున్న జావేద్ అనే వ్యక్తి బుధవారం రాత్రి సద్మాని ఇంటి గేటు బయట మూత్ర విసర్జన చేయడానికి యత్నించాడు. ఇది గమనించిన సద్మాని, ఆమె కూతురు బిన్నో ఇదేమిటని అతన్ని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన అతను వారిద్దరిని దుర్భాషలాడటమే కాకుండా..తన జేబులోని తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కూతుర శరీరంలోకి రెండు బుల్లెట్లు, తల్లి శరీరంలోకి ఒక బుల్లెటు దూసుకుపోయింది. వెంటనే వీరిని స్థానికులు ఏయిమ్స్‌కు తరలించారు. అయితే కూతురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జావేద్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసు అదనపు కమిషనర్ అజయ్ చౌదరి తెలియజేశారు.