మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
శ్రీకాకుళం,ఆగస్ట్6(జనం సాక్షి ):రిమ్స్‌లో ఇంజక్షన్ వికటించి చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం పరామర్శించారు. ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించామని, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. ఇంజక్షన్ వికటించి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మానవ తప్పిదం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దోషులు ఎంతటివారైనా చట్టప్రకారం శిక్షిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇంజక్షన్ వికటించి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఘటనలో మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన మానవ తప్పిదమని, ఎవ్వరినీ ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఇంజక్షన్‌లకు సంబంధిత మందు సరఫరా చేసిన కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.