మెదడు వ్యాధితో పదో తరగతి విద్యార్థిని మృతి
పినపాక : ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని ఎల్చీరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాలలో పదోతరగతి
చదువుతున్న పాయంనాగమణి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిరుమళ్ల గ్రామానికి చెందిన నాగమణి ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. నేడు చివరి పరీక్ష సందర్భంగా ఉదయాన్నే నిద్రలేచిన నాగమణి హాస్టల్లోనే కుప్పకూలింది. వెంటనే 108 సాయంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. మెదడు సంబంధిత వ్యాధితో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారని సహాయ గిరిజన సంక్షేమాధికారి కె.సీతారాములు తెలిపారు. చివరి పరీక్ష రోజు విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పాఠశాలలో విషాదం నెలకొంది.