మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు

స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు

గతంలో వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకున్న ట్రాఫిక్‌ రామస్వామి

బావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు, డీఎంకే శ్రేణులు

చెన్నై,ఆగస్టు8(జ‌నం సాక్షి): డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకి తొలగిపోయింది. ఆయన అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు స్థలం కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మెరీనాలో ఏర్పాట్లు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దివంగత డీఎంకే నేత అన్నాదురై సమాధి సవిూపంలోనే కరుణానిధి ఖననానికి ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేమన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని న్యాయమూర్తులు తోసిపుచ్చారు. కోర్టు తీర్పు గురించి తెలియగానే రాజాజీ హాలు వద్ద ఉన్న కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ కంటతడి పెట్టారు. డీఎంకే మద్దతుదారులు భావోద్వేగంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించడంతో దీనిపై డీఎంకే మంగళవారం రాత్రే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు అర్థరాత్రి విచారణ చేపట్టింది. బుధవారం ఉదయం 8గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించిన దాఖలాలు లేవని వెల్లడించింది. అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత ముఖ్యమంత్రులుగా కన్నమూసినందునే వారికి మెరీనా బీచ్‌లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీరప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని.. ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేదని గుర్తుచేసింది. ఎంజీఆర్‌ భార్య జానకి రామచంద్రన్‌కు కూడా డీఎంకే ప్రభుత్వం మెరీనాలో స్థలం కేటాయించ లేదని తెలిపింది. కాగా దీనిపై డీఎంకే న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. జయలలిత స్మారకానికి 3500 చదరపు అడుగుల స్థలం కేటాయించగా, తమిళ ప్రజలకు ఎంతగానో సేవ చేసిన కరుణానిధికి ఆరడుగుల స్థలం కూడా కేటాయించలేరా అని అడిగారు. ఏడు కోట్ల తమిళుల్లో కోటి మంది డీఎంకే అభిమానులున్నారని, మెరీనాలో స్థలం కేటాయించకపోతే వారి మనోభావాలు దెబ్బ తింటాయని పేర్కొన్నారు. కరుణానిధికి మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వకపోతే ఆయనకు గౌరవప్రదమైన అంత్యక్రియలు జరిగినట్లు కాదని, అవమాన పరిచినట్లే అని కోర్టులో వెల్లడించారు. కామరాజ్‌ నాడార్‌ అంత్యక్రియల విషయంపైనా డీఎంకే స్పందించింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మెరీనాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అసలు ప్రభుత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. మేము మెరీనా బీచ్‌లో స్మారకం కడతామని అడగడం లేదు.. కేవలం ఖననం చేసేందుకు స్థలం అడుగుతున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకానికి తీసుకున్న అనుమతి చూపించండి అంటూ మద్రాస్‌ హైకోర్టు అన్నాడీఎంకేను అడిగింది. అంతేకాకుండా మెరీనా బీచ్‌లో అంతిమ సంస్కారాలు జరపకుండా, ఎలాంటి

కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని గతంలో దాఖలైన పిటిషన్లను కూడా ఆయా పిటిషన్‌దారులు వచ్చి వెనక్కి తీసుకున్నారు. మెరీనా బీచ్‌లో ఖననాలను నిషేధించాలని కోరుతూ తాను వేసిన పిటిషన్‌ను సామాజిక ఉద్యమకారుడు ట్రాఫిక్‌ రామస్వామి ఉపసంహరించుకున్నారు. మెరీనా తీరంలో కరుణ అంత్యక్రియలకు ఇబ్బంది లేదని లిఖితపూర్వకంగా హైకోర్టుకు నివేదించారు. దీంతో ట్రాఫిక్‌ రామస్వామి పిటిషన్‌తో పాటు అన్ని పిటిషన్లనూ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. మద్రాస్‌ హైకోర్టు తీర్పు సానుకూలంగా రావడంతో డీఎంకే శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. దీంతో న్యాయస్థానం వాటి ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఈ వ్యాజ్యాలు కూడా వెనక్కి తీసుకున్నందున ఇంకా విూకున్న అభ్యంతరం ఏంటని కోర్టు అన్నాడీఎంకేను అడిగింది. ఇరువైపుల వాదనలన్నీ విన్నఅనంతరం కోర్టు కలైంజ్ఞర్‌ అంత్యక్రియలు మెరీనాలో నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.