మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి
మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్ శంకుస్థాపన
వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు
కేంద్రమంత్రి కిషన్ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం
మేడ్చెల్,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్‌రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మేడ్చల్ బాగా విస్తరిస్తుందని, మంచి హాస్పిటల్ కావాలని కోరారన్నారు. దవాఖానకు కొత్తగా ఎనిమిది మంది వైద్యులు, 16 మంది స్టాఫ్‌నర్సులతో పాటు 50 మంది సిబ్బంది అదనంగా ఇస్తామని హావిూ ఇచ్చారు. అలాగే అదనంగా బిల్డింగ్ ఇస్తామని, ఏడున్నర కోట్లతో శంకుస్థాపన చేశామని, ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పు అయితే.. 30వేల నుంచి 50వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉచిత వైద్యసేవలు అందిచడంతో పాటు కేసీఆర్ కిట్, రూ.13వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ముహూర్తం చూసి కాన్పునకు వెళ్తే తల్లీబిడ్డకు నష్టమని హెచ్చరించారు. పెద్ద ఆపరేషన్ చేయమని వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారని, దీంతో తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని, ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. 40 సంవత్సరాలకే అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. ప్రాణానికి హాని ఉంటేనే డాక్టర్లు ఆపరేషన్ చేయాలా? వద్దా? అని నిర్ణయిస్తారన్నారు. అమెరికాలాంటి దేశాల్లో 20`30 శాతమే ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ 70`80 శాతం ఆపరేషన్లు చేస్తున్నారని, దీంతో పిల్లలకు నష్టమన్నారు. తొలి గంటలో తల్లిపాలు బిడ్డకు
పట్టించడం టీకాలంటిదని, పెద్ద ఆపరేషన్‌తో తల్లిపాలు తాగే అవకాశం బిడ్డ కోల్పోతుందన్నారు. దాంతో రోగ నిరోధకశక్తి పిల్లల్లో తగ్గుతుందన్నారు. గాంధీలో 250, నిమ్స్ లో 250 పడకల మాతా శిశు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అత్యాధునిక సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని, వేలకోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్తీల్లో డాక్టర్లను నియమించి.. పేదల సుస్తిని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్‌లో 13 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో పది రోజుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నార్మల్ డెలివరి చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు, స్టాఫ్ నర్సుకు, ఆశ వర్కర్లకు ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని, సరైన భోజనం లేక కాన్ను సమయంలో ఇబ్బందులుపడుతున్నారన్నారు. నిరుపేదలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గాంధీ, ఉస్మానియాతో పాటు నగరంలో 18 ఆసుపత్రుల్లో నిత్యం 30వేల మంది పేషెంట్లతో వచ్చే సహాయకులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీబీ నగర్ వెళ్లి ఎయిమ్స్ ఆసుపత్రి దగ్గర అడ్డగోలుగా మాట్లాడరని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎయిమ్స్ ప్రతిష్టాత్మక సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ పెడతమంటే 201 ఎకరాల భూమి ఇచ్చిందని, 200 పడకల ఆసుపత్రి ఇచ్చిందన్నారు. నాలుగేళ్లయినా ఇవాళ్టికి ఒక్క కాన్పు చేయలేదన్నారు. ఆపరేషన్ థియేటర్ లేదని, బ్లడ్ బ్యాంక్ లేదని, మెడికల్ స్టూడెంట్స్ వచ్చారని, వారు ఏం చదువుకోవాలని ప్రశించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దరిస్తోందని చెప్పుకుంటున్నారని.. విద్యార్థులు ఎందుకు చేరామని నెత్తి పట్టుకుంటున్నారన్నారు. తాము ఎయిమ్స్‌లో చేయమని అంటున్నారని.. ఉస్మానియా, గాందీలో చేర్చుకోవాలని కోరుతున్నారని.. కిషన్‌రెడ్డి ఎయిమ్స్ వెళ్లి చూడాలన్నారు. ఎయిమ్స్ పరువు తీశారని, కేంద్రం దిగజార్చిందని హరీశ్‌రావు మండిపడ్డారు. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో 1083 డెలివరీలు అయ్యాయని, రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో 245 డెలివరీలు జరిగాయన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఉన్న అర్బన్ పీహెచ్‌సీలో 13 అయ్యయాని తెలిపారు. ఎయిమ్స్‌లో ఒక్క డెలివరీ కాలేదని.. ఇది విూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పనితీరు అంటూ మంత్రి ధ్వజమెత్తారు. పని చేసే వైద్యులను తగ్గించేలా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు.