మేమంతా కలిస్తే బీజేపీ ఫినిష్‌..!

– బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు ఏకంకావాలి
– నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా
కోల్‌కతా, జులై28(జ‌నం సాక్షి) : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. శనివారం ఒమర్‌ అబ్దుల్లా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు. దేశంలోని పరిస్థితిపై చర్చించారు. అనంతరం విూడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో బేజేపీని ఎంత సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చనే అంశంపై ఉభయులూ చర్చించామన్నారు. కాంగ్రెస్‌ను కలుపుకోకుండా విపక్షాల ఐక్యతా ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు, ఐక్యత సాధించేందుకు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేస్తున్న ప్రయత్నాలను ఒమర్‌ కొనియాడారు. విపక్షాలతో మంతనాల జరపడమనేది నిరంతర పక్రియ అని, ముఖ్యంగా సోనియా గాంధీ విపక్షాల ఐక్యతకు తగినంత కృషి చేస్తున్నారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి మేమంతా మరింత దగ్గరవుతామని, ఐక్య కూటమి చాలా గొప్పు రూపు సంతరించుకుంటుందని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ ఒమర్‌ ధీమా వ్యక్తం చేశారు.