మైనర్ బాలికలు తప్పిపోతుంటే పట్టించుకోకుండా ఎమ్మెల్యే పాదయాత్రలా?
తెల్కపల్లి ఎస్ఐ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన బిఎస్పీ నాయకులు.
బి.ఎస్.పి అసెంబ్లీ ఇన్చార్జి కొత్తపల్లి కుమార్.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
19 రోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలు మ
తప్పిపోయినా ఆ సమస్యను పట్టించుకోకుండా,ఎమ్మెల్యే పాదయాత్రలో ఉండటం ఏంటని బి.ఎస్.పి నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జి కొత్తపల్లి కుమార్ ప్రశ్నించారు.శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో కుర్వ నాగరాజు లక్ష్మీదేవిల కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జీ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ ఆగస్ట్ నెల 20వ తేదీన నాగరాజు, లక్ష్మీదేవి దంపతుల ఇద్దరూ మైనర్ బాలికలు ఇంటి నుండి కిరాణం షాప్ కి వెళ్లి వస్తామని వెళ్లి ఆ రోజు నుంచి నేటి వరకు మైనర్ బాలికల ఆచూకీ లభ్యం కావడం లేదని తెలిపారు. ఇట్టి విషయంపై ఆగస్ట్ 22వ తేదీన మనస్థాపానికి గురై నాగరాజు దంపతులు పురుగులు మందు సేవించారు.అదే రోజు తెలకపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అన్ని సంఘటనల గురించి విచారణ జరిపారని,అదే రోజు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. కాకపోతే ఆ రోజు నేటి వరకు విచారణ ముందుకు సాగడం లేదని కొత్తపల్లి కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని, అనేక సార్లు ప్రభుత్వం చెప్పడం శుద్ధ అబద్ధమని తేలిందన్నారు. దానికి నిదర్శనమే గౌరారం సంఘటన అన్నారు. మైనర్ బాలికల మిస్సింగ్ పై ఇంత నిర్లక్షం ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాదయాత్రలో మండల ఎస్సై, సిబ్బంది ఉంటే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదా అనీ నిలదీశారు. ఎస్సైకి జీతం ఎమ్మెల్యే ఇస్తాడా, ప్రజలు ఇస్తారా అనీ అడిగారు. ఎస్సై కేవలం ఎమ్మెల్యే పాదయాత్రలో ప్రజా సమస్యలపై నిలదీసిన వారిని భయాందోళలకు గురి చేయడం, మొబైల్స్ లాక్కోవడం వంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ఎస్సై నిర్లక్షంపై జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు.సత్వరమే మైనర్ బాలికల కేసును పరిష్కరించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు శివశంకర్, నాయకులు శ్రీ హర్ష ముదిరాజ్, సాయిబాబు, రాజేష్, నాగార్జున, మహేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.