మైనార్టీలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు

– మరుగుదొడ్ల పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు.
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ, సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి) : మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని తరుచూ చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదో వివరణ ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రికి వారానికో లేఖ సంధిస్తున్న కన్నా..  గురువారం 13వ లేఖను రాశారు. గతంలో ఎన్నడూ మైనార్టీలు లేని మంత్రివర్గాన్ని చూడలేదని కన్నా అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిధులను.. ప్రత్యేక ¬దాపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి ఎలా వెచ్చిస్తారని నిలదీశారు. ఈ నిధులను విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, పరిశోధనలకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో తెదేపా నేతలు మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకుని, ఆ నిధులను కాజేస్తున్నారని కన్నా ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై సోమయాజులు కమిటీ ఇచ్చిన నివేదిక నిజమని.. చంద్రబాబు నమ్మతున్నారా అని ప్రశ్నించారు. ఘటన జరిగి 72గంటలు గడవకముందే అక్కడి సీసీ కెమెరాల దృశ్యాలు ఎందుకు డిలీట్‌ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై చంద్రబాబుకు సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా అని సవాల్‌ చేశారు. హైదరాబాద్‌, ఉండవల్లి, నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసాలకు మరమ్మతుల పేరిట రూ.3.20కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని కన్నా డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు