మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– నాలుగేళ్లలో రూ. 2,679 కోట్లు కేటాయించాం
– వారిని అన్ని విధాలా ఆదుకుంటాం
– మైనార్టీల సమావేశంలో ఏపీ మంత్రి లోకేష్‌
ప్రకాశం, నవంబర్‌29(జ‌నంసాక్షి) : మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, వారికి అన్ని విధాల అండగా ఉంటామని ఏపీ మంత్రి లోకేష్‌ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులోని ఆటోనగర్‌ మసీదులోని మైనార్టీ సోదరులతో మంత్రి నారా లోకేష్‌ గురువారం భేటీ అయ్యారు. మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి, వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి నాలుగేళ్లలో రూ.2,679 కోట్లు కేటాయించామని తెలిపారు. కడప , విజయవాడ లో రూ. 24 కోట్లతో హజ్‌ హౌస్‌ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇమ్మామ్‌ లకు రూ.5 వేలు , మౌజన్లకు రూ. 3 వేలు పారితోషకం ఇస్తున్నామని చెప్పారు. ఉర్దూ భాషాభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించి, కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ
ఏర్పాటు చేశామన్నారు. రంజాన్‌ మాసంలో మసీదుల అలంకరణకు, ఇఫ్తార్‌ విందులకు రూ. 5 కోట్లు ఇచ్చామన్నారు. దుల్హన్‌ పథకం కింద ఇప్పటికే రూ.12 వేల మందికి ఒక్కొక్కరికి రూ.50 వేలు పెళ్లి కానుక ఇచ్చామని తెలిపారు. రంజాన్‌ తోఫా ఇస్తున్నామన్నారు. విదేశాల్లో విద్య కి సహకారం అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షల సాయం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ లను, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా లోన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హావిూ నిలబెట్టుకుంటున్నామని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.