మైన్స్‌ నీటిగుంటలో పండి బాలిక మృతి

తరచూ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు
అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం
చిత్తూరు,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): శ్రీకాళహస్తీ మండలం తోట్టంబేండులో శనివారం విషాదం చోటు చేసుకుంది. తోట్టబేడు మైన్స్‌ నీటిగుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంటలో పడి బాలిక గల్లంతైంది. నాలుగు గంటల గాలింపు అనంతరం బాలిక మృతదేహం లభించింది. వివరాల్లోకెళితే.. తోట్టంబేడులో నివాసముంటున్న మల్లిక, రఫీల కుమర్తె ఆఫ్రిన్‌ (14) ఈ రోజు ఉదయం బట్టలుతకడానికి తోట్టబేడు మైన్స్‌ నీటిగుంటలో దిగింది. ప్రమాదవశాత్తూ కాలుజారి నీటి గుంటలో పడి గల్లంతైంది. 4 గంటల పాటు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీసులు కలిసి ఆఫ్రిన్‌ కోసం నీటి గుంటలో గాలించగా.. బాలిక మృత దేహం కనిపించింది. కుమార్తె మృతదేహం కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు రోదించారు. కుమార్తె
మృతదేహాన్ని భుజాన వేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో మైన్స్‌ నీటి గుంటల వల్ల చాలా సార్లు ప్రమాదాలు జరిగాయన్నారు. తరచూ చిన్నారులు చనిపోతున్నప్పటికీ మైన్స్‌ సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మైన్స్‌ను తవ్వి వాటిని పూడ్చకుండా అధికారులు వదిలేయడంతో ఆ మైన్స్‌ గుంటల్లో నీరు చేరుతుందని, నీటి గుంటల్లో ఈత కొట్టడానికి, బట్టలుతకడానికి వెళ్తున్న చిన్నారులు శవాలుగా మారుతున్నారని ఆవేదన చెందారు. చిన్నారులు చనిపోతున్నా అధికారులు మాత్రం ఏవిూ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.