మొండి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం

ఖాతాదారులకు వదులుతున్న చమురు

అన్ని బ్యాంకులదీ అదే దారి

ముంబయి,జూలై20(జ‌నం సాక్షి): మొండి బాకీల భారం సామాన్యులపై భారీగా పడుతోంది. వాటి నష్టాన్ని పూడ్చుకోవడానికే అన్నట్లుగా బ్యంకులు ఖాతాదారులపై ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీలు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరవాత ఆయా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు చూస్తే బ్యాంక్‌ ఖాతా లేకపోవడమే ఉత్తతమని భావిస్తున్నారు. మరోవైపు పాతకాయిల వసూలుకు సంబంధించి నిర్దుష్ట విధానం అవలంబించడం లేదు. మొండిబకాయిదారుల పేర్లను వెల్లడించాలని గతంలో సుప్రీం ఆదేశించిన ఎందుకనో ఆర్‌బిఐ ముందుకు రావడం లేదు. మొత్తంగా మొండిబకాయిల దెబ్బకు బ్యాంకుల నడ్డి విరుగుతోంది. దేశంలోని 50 అతిపెద్ద రుణ ఖాతాల మొండి బాకీల వల్ల వివిధ బ్యాంకులు దాదాపుగా రూ.2.4 లక్షల కోట్లు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం యాబై కంపెనీలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బాకీలుగా మారిన మొత్తంలో 60 శాతం మేర రద్దు చేసుకోవాల్సిన దుస్తితి నెల కొంది. వీటి మొండిబకాయిలు రూ.4 లక్షల కోట్ల మేర ఉన్నాయి. 50 కంపెనీల్లో 30 శాతం అప్పులు మెటల్‌ రంగానివే అని గుర్తించారు. నిర్మాణ రంగం 25 శాతం, విద్యుత్‌ 15 శాతం చొప్పున బ్యాంకులకు నిరర్థక ఆస్తులను మిగిల్చాయి. 2017 మార్చి 31 నాటికి బ్యాంకుల మొత్తం మొండి బాకీలు రూ.8 లక్షల కోట్లలో ఈ 50 కంపెనీల వాటా దాదాపుగా సగం మేర ఉన్నాయి. మొత్తం నిరర్థక ఆస్తుల్లో కనీసం సగానికి పైగా రుణాలు ఈ రంగాలివే. భారత జిడిపిలో ఇవి 5 శాతం. ఆర్థిక విలువ ఆధారితంగా ఈ రైటాఫ్‌ విలువను లెక్కించామని క్రిసిల్‌ రేటింగ్స్‌ చీఫ్‌ వెల్లడించారు. ఈ కంపెనీలు తమ రుణాలను చెల్లించేందుకు సిద్ధంగా లేవని క్రిసిల్‌ విశ్లేషించింది. వీటి గురించి బ్యాంకులు కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుందని పేర్కొంది. చివరిగా తీసుకునే రైటాఫ్‌ విలువ, బ్యాంకుల అంచనాలు, సబ్సిడరీలు వాల్యుయేషన్‌, కమోడిటీతో మిలితమయ్యే రంగాల ధరల అవుట్‌లుక్‌తో ప్రభావితమై ఉంటుందని క్రిసిల్‌ వివరించింది. ఈ కంపెనీలన్నీ వ్యాపారంలో సమగ్రత కలిగిలేవని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న బ్యాంకింగ్‌ రంగంలో నూతన విధానాలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. నిర్వహణ వ్యయం పెరగడం, ప్రాజెక్టులకు తగు సమయంలో అనుమతులు లభించకపోవడం తదితర పరిణామాలు కంపెనీల చెల్లింపులపై ఒత్తిడిని పెంచాయి. ఇప్పటికే బ్యాంకులు మొండి బాకీల కింద కేటాయింపులు చేశాయని క్రిసిల్‌ రిపోర్టులో పేర్కొంది. తాజాగా మరో 20 శాతం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నష్టాలను తట్టుకోవడానికి బ్యాంకులకు సరిపడ మూలధనం అవసరం ఉంటుంది. కొత్త నిధులు లభిస్తేనే రుణాల మంజూరులో వృద్ధికి దోహదం చేయనుంది. లేనిచో బలహీన వృద్ధికి కారణం కానుంది. ఇప్పటికే భారత బ్యాంకుల స్థూల మొండి బాకీలు రూ.8 లక్షల కోట్లకు చేరడంతో బ్యాంకుల ఫలితాలపై, లాభాలపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది.