మోగిన సమ్మెసైరన్‌..

– ఫిబ్రవరి 6 నుంచి ఏపీ ఆర్టీసీ సమ్మెబాట
– ఆర్టీసీ, కార్మిక సంఘాల నేతల మధ్య చర్చలు విఫలం
– సమ్మెబాట పట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : ఏపీ ఆర్టీసీలో సమ్మెసైరన్‌ మోగనుంది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, కార్మిక సంఘాల నేతల మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమవ్వడంతో సమ్మెబాట పట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి వచ్చింది. దీంతో సమ్మె తేదీని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేపట్టనున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేయాలని ఐకాస నిర్ణయించింది. ఈ సమ్మెలో ఈయూ సహా 9 కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. 50శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 91 డిమాండ్లతో డిసెంబర్‌ 31న ఆర్టీసీ యాజమాన్యానికి ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. నోటీసు ఇచ్చిన తర్వాత పలుమార్లు కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. 20శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల నేతలకు స్పష్టం చేసింది. దీంతో సమ్మెకు దిగాలని కార్మిక సంఘాల ఐకాస నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి ముందే సమ్మెకు వెళ్లాలనుకున్న కార్మిక జేఏసీ.. పండుగ తర్వాత డిమాండ్లపై సీఎంతో చర్చిస్తామని యాజమాన్యం హావిూ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసుకుంది. పండుగ తర్వాత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగనుంది.  మొత్తం 13 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని యూనియన్‌ నేతలు తెలిపారు. తమ ప్రదానమైన డిమాండ్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
చేయాలని, వేతన సవరణ అమలు చేయాలని, పెండింగ్‌ బకాయిలు చెల్లించాలనే తదితర డిమాండ్లతో జేఏసీ సమ్మెకు దిగుతోంది. ఆర్టీసీలోని 8 కార్మిక సంఘాలు ఏకమై సమ్మెకు సిద్ధమవుతున్నాయి. వారికి అధికారుల సంఘం(ఓస్వా) కూడా మద్దతు పలకడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఆర్టీసీలో పెద్ద యూనియనైన ఎన్‌ఎంయూతో గుర్తింపు సంఘం సంప్రదింపులు జరుపుతోంది. గతంలో రెండు సంఘాలూ ఏకమై 43శాతం ఫిట్‌మెంట్‌ సాధించుకున్నాయి. అదే అనుభవంతో ఇప్పుడు మరోసారి ఐక్యంగా సమ్మెబాట పట్టాలని ఈయూ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.