మోదీజీ…

విూరు సృష్టించిన ఉపాధి ఎక్కడ?
– ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షల ఏమయ్యాయి?
– ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటున్నారు
–  దేశం నెత్తిన జీఎస్టీ బలవంతంగా రుద్దారు
– దేశానికి సైనికునిలా పనిచేస్తానన్నావ్‌
– అమిత్‌షా కొడుకు అవినీతికి పాల్పడినప్పుడు ఆ సేవకుడు ఏమయ్యాడు?
– మోదీ కాపలాదారు కాదు.. పలాయణదారి
– రాఫెల్‌ ఓప్పందంలో లక్షలకోట్ల అవినీతి జరిగింది
– మోడీ, అమిత్‌షాలు పవర్‌లేకుండా ఉండలేరు
– ఇది రైతు వ్యతిరేఖ ప్రభుత్వం
– రైతుకు పైసా ఇచ్చేందుకు మోదీకి మనసొప్పదు
– దళితులు, మహిళలపై దాడులు జరుగుతుంటే నొరెందుకు మెదపరు?
– భాజపా విధానాలపై లోక్‌సభలో విరుచుకుపడ్డ రాహుల్‌గాంధీ
– ప్రసంగం ముగించి ప్రధాని వద్దకు వెళ్లి అలింగనం చేసుకున్న రాహుల్‌
– రాహుల్‌ చర్యలతో అవాక్కైన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : తాము అధికారంలోకి వస్తే ప్రతీ ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. పేదవారి వద్ద నుంచి రైతులు, చిరు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు ఇలా ఏ వర్గం వారు కేంద్ర ప్రభుత్వం పాలనపై సంతృప్తిగా లేరని, జీఎస్టీ, నోట్ల రద్దుతో చిరువ్యాపారుల నడ్డివిచారని ధ్వజమెత్తారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెదేపా ఎంపీ చేసిన ప్రసంగం ద్వారా ఏపీ ప్రజల బాధ, ఆవేదన అర్థమైందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. 21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఆంధప్రదేశ్‌ ప్రజలు బాధితులుగా మారారన్నారు. ప్రధానమంత్రి అనే పదానికి భారత ప్రజానీకం అర్థం వెతుకుతోందని రాహుల్‌ మండిపడ్డారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షలు, ఏటా 2కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని హావిూ ఇచ్చారన్నారు. 2014లో దేశ మొత్తవ్మిూద కేవలం 4లక్షల
మందికి మాత్రమే ఉపాధి లభించిందని, ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటూ సలహా ఇస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ స్లాబ్‌ ఒకటే ఉండాలని చెప్పాం.. కానీ ఐదు స్లాబ్‌లు పెట్టారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని కోరినా పట్టించుకోలేదన్నారు. ఒకరోజు అర్థరాత్రి ఆకస్మాతుగా పెద్దనోట్లు రద్దు చేశారని, దాని వల్ల ఏం ప్రయోజనం జరిగిందని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల మధ్య, చిన్న తరగతి పరిశ్రమలు దివాళా తీశాయన్నారు. వాటిలో పనిచేస్తున్న ఎంతో మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దేశం నెత్తిన జీఎస్టీ రుద్దారని, విూరిచ్చిన ఉపాధి హావిూలన్నీ నీటిమూటలయ్యాయని రాహుల్‌ మండిపడ్డారు. తాను దేశానికి ప్రధానమంత్రి కాదు.. సేవకుడిగా ఉంటానని మోదీ చెప్పారని, అమిత్‌ షా కుమారుడు అవినీతికి పాల్పడినప్పుడు ఈ సేవకుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ మిత్రుడి కొడుకు అని సంబంధించడంతో ప్రధాని మోదీ నవ్వుకున్నారు. ఈ నవ్వుపై కూడా రాహుల్‌ తిరిగి మాట్లాడుతూ.. ప్రధాని నవ్వుతున్నా ఆయన మనసులో ఆందోళన కనిపిస్తోందన్నారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతోందన్నారు. తాను చేసిన ఆరోపణలు దేశం మొత్తం చూస్తోందన్నారు. కానీ ప్రధాని మాత్రం తన కళ్లలోకి చూడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మోదీ కాపలాదారు కాదు.. పలాయానవాది అని రాహుల్‌ అభివర్ణించారు.
రాఫెల్‌ ఒప్పందంలో కోట్ల అవినీతి జరిగింది..
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. యూపీఏ హయాంలో ఒక్కో రాఫెల్‌ విమానం ఖరీదు రూ.520కోట్లు, ప్రధాని ఫ్రాన్స్‌ వెళ్లి ఎవరితోనో చర్చలు జరిపారు. ఇప్పడు విమానం ఖరీదు రూ.1,600కోట్లు. ప్రధాని ఎవరితో కలిసి ఫ్రాన్స్‌ వెళ్లారో చెప్పాలని రాహుల్‌ ప్రశ్నించారు. నేనే స్వయంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని కలిశాను. ఆయన ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు. రక్షణ మంత్రి అబద్ధాలు చెబుతున్నారని రాహుల్‌ అన్నారు. ఒక వ్యక్తికి రాఫెల్‌ కాంట్రాక్టు వెళ్లిందని, ఆయనకు వేల కోట్ల లాభం చేకూరిందని అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌ అనుమతి లేకుండా సభలో ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని నిలదీశారు. సభలో ఆరోపణలు చేసే సమయంలో స్పష్టమైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 1.45 గంటలకు వాయిదా వేశారు. తిరిగి పదినిమిషాల తరువాత సభ ప్రారంభమైంది. రాహుల్‌ వాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. రాఫెల్‌ విమానాల కొనుగోలుపై గోప్యత పాటించాలని 2008లోనే ఒప్పందం జరిగిందన్నారు. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సంతకం చేసిన పత్రాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టారు. వాణిజ్యపరమైన ఒప్పందం వల్లే పూర్తి వివరాలను వెల్లడించమలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడే స్వయంగా చెప్పారని సభకు తెలిపారు. కాగా, రహస్య ఒప్పంద పత్రాలను సభలో ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తంచేయగా.. అవి అప్పటి రక్షణ మంత్రి సంతకం చేసిన ప్రతులు మాత్రమేనని సీతారామన్‌ తెలిపారు. అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ.. ఎన్డీయే హయాంలో దేశంలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలోని మహిళలకు రక్షణ లేని పరిస్థితి గురించి ప్రపంచంలో తొలిసారిగా మాట్లాడుకుంటోందన్నారు. ఈ పరిస్థితి
చరిత్రలో ఎన్నడూ చూడలేదని రాహుల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించలేక ప్రపంచం ముందు చులకన అవుతున్నామన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదన్నారు. దేశంలోని పది మంది పెద్ద వ్యాపారవేత్తలకు రెండున్నర లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయించారని రాహుల్‌ అన్నారు. ప్రపంచమంతా పెట్రోల్‌ ధరలు తగ్గుతుంటే… మనదేశంలో మాత్రం పైపైకి పోతుందని విమర్శించారు. వ్యాపారులకు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు గానీ, రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వడానికి మోదీ మనసు అంగీకరించదని అన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని రాహుల్‌ ధ్వజమెత్తారు. దాడులు చేసిన వారికి మోదీ ప్రభుత్వంలో మంత్రులు దండలు వేస్తారని, దళితులు, మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రధాని ఒక్క మాట మాట్లాడరు. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని గ్లోబల్‌ సర్వే ఆన్‌ విమెన్‌ వెల్లడించిందని అన్నారు. మోదీ, అమిత్‌ షాలు విభిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తుల అని, వారికి ఎక్కడ అధికారం కోల్పోతామనే భయం వెంటాడుతుందని అన్నారు. రైతులకు మద్దతు ధర కోసం రూ.10,000 కోట్లు వెచ్చించామని కేంద్రం అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు. కర్ణాటకలో రైతు రుణమాఫీకి రూ.34,000 కోట్లు కేటాయించిన విషయాన్ని రాహుల్‌ గుర్తుచేశారు.
మోడీని అలింగనం చేసుకున్న రాహుల్‌..
పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. తన ప్రసంగంతో, చర్యలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి తెరతీశారు. ఆసాంతం ఆవేశంగా ప్రసంగం కొనసాగించిన రాహుల్‌.. అరుదైన చర్యతో తన స్పీచ్‌ ముగించారు. నాపై విూకు విపరీతమైన ద్వేషం ఉండొచ్చు, నన్ను విూరు పప్పూ అని.. ఇంకా అనేక పదాలతో దూషించవచ్చు. కానీ, విూపై నాకు ఎలాంటి ద్వేషం లేదు అని మోదీ, అమిత్‌ షాను ఉద్దేశించి రాహుల్‌ అన్నారు. అనంతరం నేరుగా ప్రధాని వద్దకెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ చర్యలతో ఒక్కసారిగా అవాక్కైన ప్రధాని మోదీ వెంటనే రాహుల్‌ను పిలిచి మళ్లీ సేకెండ్‌ ఇచ్చారు. ఈ ఉదంతంతో లోక్‌ సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. పార్లమెంట్‌లో రాహుల్‌ చర్య హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన స్టంట్‌ సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్‌కు గురిచేసింది. ఆ చర్య తర్వాత కెమెరాలన్నీ రాహుల్‌ వైపే తిరిగాయి. ప్రసంగం ముగించిన రాహుల్‌.. తన సీట్లో కూర్చున్న తర్వాత కూడా ముసిముసి నవ్వులు, తనవైన హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.