మోదీపై రసాయన దాడి హెచ్చరిక

– యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబయి, జులై30(జ‌నం సాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రసాయన దాడి చేస్తానని జాతీయ భద్రతా దళాని(ఎన్‌ఎస్‌జీ)కి ఫోన్‌ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న 22ఏళ్ల కాశీనాథ్‌ మండల్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సెంట్రల్‌ ముంబయిలోని డీబీ మార్గ్‌ పోలీసులు జులై 27న ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. కాశీనాథ్‌ ఢిల్లీలోని ఎన్‌ఎస్‌జీ కంట్రోల్‌ రూమ్‌ నెంబరుకు గత శుక్రవారం ఫోన్‌ చేశాడు. ప్రధాని మోదీపై రసాయన దాడికి పాల్పడతానంటూ అధికారులను హెచ్చరించాడు. దీంతో ఎన్‌ఎస్‌జీ తమకు వచ్చిన ఫోన్‌ కాల్‌ ఆధారంగా నంబర్‌ను ట్రాక్‌ చేసింది. అది ముంబయి నుంచి వచ్చిందని తెలుసుకుని అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ జరిపి ఆ ఫోన్‌ కాల్‌ చేసింది కాశీనాథ్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతడిని ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఝార్ఖండ్‌ ఎన్‌కౌంటర్‌లో తన స్నేహితుడు మరణించాడని, ఈ విషయం నేపథ్యంలో తాను ప్రధాని మోదీని కలవాలనుకున్నానని కాశీనాథ్‌ విచారణలో చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్‌ అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా సోమవారం వరకు కోర్టు పోలీసు కస్టడీ విధించింది. అతడిని సోమవారం మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు.