మోదీ.. చేనేతపై జీఎస్టీ రద్దు చెయ్‌..

` పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన కేటీఆర్‌
` స్వదస్తూరీతో చేనేత సమస్యలను పోస్ట్‌ కార్డులో ప్రస్తావించిన మంత్రి
` రాష్ట్రంలోని నేతన్నలతోపాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్‌ కార్డు రాయాలని పిలుపు
హైదరాబాద్‌(జనంసాక్షి):చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్‌ కార్డుని రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్‌ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్‌, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్ట్‌ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలను ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్న కేటీఆర్‌,  వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై పన్ను వేసిందని విమర్శించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అన్నారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్‌ భారత్‌, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే కేంద్ర ప్రభుత్వం… తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్‌ రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక సాంస్కృతి సారథులుగా పరిగణించి చేనేతపైన వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రగతి భవన్‌ నుంచి చేనేత కార్మికుల పక్షాన పోస్ట్‌ కార్డును రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు అందరితోపాటు చేనేత కార్మికులు వారి ఉత్పత్తుల పట్ల ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్‌ కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని తద్వారా నోరులేని నేత కార్మికుల బాధల్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

 

(పెట్రో ధరలతో సామాన్యుడి నడ్డి విరిచారు
` సెస్సులు తగ్గించి పెట్రో ధరలు తగ్గించాలి
` ఆయిల్‌ కంపెనీలకు రాయితీలు..మహిళలకు భారమా
` ప్రధాని మోడీపై మంత్రి  కెటిఆర్‌ విమర్శలు
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం(జనంసాక్షి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని మోదీని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సరుకు రవాణా రంగం సమస్యలను అర్థం చేసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సరుకు లేదు. మాట్లాడితే ఇతరుల విూద నెపాన్ని తోసేస్తారు. ముడి చమురు ధర పెరగలేదు కానీ.. పెట్రోల్‌ ధరలు పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల విషయంలో పన్నులు పెంచలేదు. కేంద్రమే అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ విధించి, రూ. 30 లక్షల కోట్లను తీసుకుంది. రాష్టాల్రకు వాటా ఇవ్వకుండా మొత్తం వారే తీసుకుంటున్నారని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ఒక ప్రెస్‌విూట్‌లో కేసీఆర్‌ను ఓ జర్నలిస్టు అడిగారు. పెంచిన సన్నాసే తగ్గించాలని కేసీఆర్‌ చెప్పారు. మోదీని డిమాండ్‌ చేస్తున్నా.. దోచుకున్నది చాలు.. ఇకనైన సెస్సులు రద్దు చేసి లీటర్‌ పెట్రోల్‌ను రూ. 70కి, లీటర్‌ డీజిల్‌ను రూ. 65కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్రూడాయిల్‌ ధరలు మారలేదు. కానీ అడిషనల్‌ డ్యూటీలు, సెస్సులు వేసి సామాన్యుడి నడ్డీ విరగ్గొడుతున్నడని మోదీపై కేటీఆర్‌ మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు అన్నిరేట్లు పెరుగుతాయి. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాటలు పెద్దవి పెద్దవి మాట్లాడారు. కానీ చేసిందేవిూ లేదు. ఒక్కడు ధనవంతుడైతే నల్లగొండ రూపు రేఖలు మారుతాయా అని ప్రశ్నించారు. సిలిండర్‌ ధర ఒకప్పుడు రూ. 400 ఇవాళ మాత్రం రూ. 1200లకు పెరిగింది. ఆయిల్‌ కంపెనీలకు రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చారు. ఆయిల్‌ కంపెనీలకు రాయితీలు ఇస్తావు.. ఆడబిడ్డలకు ఎందుకు రాయితీలు ఇవ్వరు అని ప్రశ్నించారు. సెస్సులు రద్దు చేసి పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గించాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జన్‌ ధన్‌ పేరుతో 15 లక్షలు పడతాయని కేంద్రం చెప్పింది. కాని ఒక్క లబ్దిదారుని ఖాతాలో కూడా పైసా పడలేదని చెప్పారు. గతంలో సిలిండర్‌ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1200లకు పెంచారని మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్‌ కంపెనీలు, కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు కాని.. ఆడపిల్లకు ఎందుకు రాయితీలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాలు మంచిది కాదని అంటారు. కానీ కార్పొరేట్‌ గద్దలకు పదకొండున్నర లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ అదే రైతులకు ఉచిత కరెంట్‌ ఇచ్చేందుకు వెనుకాడు తున్నారు. అన్ని వర్గాలను మోదీ మోసం చేశారు. ఎనిమిదేండ్లలో మోదీ ఏం సాధించలేదు. దేశం కోసం మోదీ ఏం చేయలేదు. అన్ని కంపెనీలను అమ్ముతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇవాళ పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి అవకాశాలు పెరుగుతున్నాయి. సరుకు రవాణా అవకాశాలు పెరుగుతున్నాయి. మరింత డిమాండ్‌ వస్తది విూ రంగానికి. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఉత్పత్తి, సంపద పెరుగుతుంది. అందరూ బాగుంటారు. అందరి విూ ముఖంలో చిరునవ్వు ఉండాలి. అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. చిల్లరమల్లర రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పాలి. లారీ డ్రైవర్లను, యజమానులను, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. మాకు పేదలు కావాలి.. పెద్దలు కావాలి. విూ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కావాలనే మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. ఒకప్పుడు లారీ ఉందంటే ఆ వ్యక్తికి సమాజంలో చాలా గౌరవం దక్కేదని గుర్తు చేశారు. కానీ నేడు పదుల సంఖ్యలో లారీలున్నా.. లారీ ఓనర్లకు దక్కాల్సినంతా గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరికో ఉపాధినిస్తున్న లారీ ఓనర్లను గౌరవించాలని కోరారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో జిల్లాకో డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూడిద రామ్‌ రెడ్డి. మంచి రెడ్డి రాజేందర్‌ రెడ్డి.రైతు బంధు కమిటీ జిల్లా అధ్యక్షులు ఒంగేటి లక్ష్మారెడ్డి. డిసిసిబి చైర్మన్‌ బియ్యాని మనోహర్‌ రెడ్డి. వైస్‌ చైర్మన్‌ కొత్త కురుమ సత్తయ్య. లారీ అసోసియేషన్‌  కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

తాజావార్తలు