మోహినీ రూపంలో శ్రీవారి దర్శనం
ఆకట్టుకుంటున్న సాంస్కృతికోత్సవాలు
తిరుమల,సెప్టెంబర్17(జనంసాక్షి ): తిరుమలలో శ్రీవారి బ్ర¬్మత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం ఆపద మొక్కులవాడు మోహినీ అవతారంలో సాక్షాత్కరించి భక్తులకు కనువిందు చేశాడు. దంతపు పల్లకిలో శ్రీ కృష్ణస్వామి తోడుగా మాఢ వీధుల్లో ఊరేగారు. భక్త బృందాల కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనా గానాలు, వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన కళాకారుల బృందాలు భక్తులను అలరించాయి. తన శరుణుగోరి తరలివచ్చిన అశేష భక్తజనం మధ్య వైభవంగా ఊరేగారు. శ్రీహరి వల్లే రాజులకు రాజ్యపాలన భాగ్యం కలుగుతుందని, అందుకే అహంకారం పనికి రాదని స్వామివారు ఈ వాహన సేవ ద్వారా సందేశమిచ్చారు. ఈ రూపంలో స్వామివారిని సేవించడం ద్వారా భక్తుల్లో అహంకారం తొలగి..
శాశ్వతమైన ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మూడు రోజులుగా పశు, పక్ష్యాదులను తన వాహనాలుగా మలచుకుని తిరువీధులలో ఊరేగారు. సమస్తరాజలాంఛనాలతో ఈ వాహనసేవను తితిదే నిర్వహించింది. వజ్రవైఢుర్యాలు పొదిగిన కనకాభరణాలు, శోభాకరమైన గజమాలలు అలంకరించింది. ఆదివారం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం కనువిందుగా జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారికి ఊంజలసేవ కన్నుల పండుగగా అర్చకులు నిర్వహించారు. ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో బకాసురున్ని సంహరిస్తున్న శ్రీకృష్ణుడి అవతారంలో ఉభయదేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో అయిదో రోజైన సోమవారం ఉదయం మోహినీ అవతార సేవ జరిగింది. ఉత్సవాల్లోనే సర్వోత్కృష్ఠమైన గరుడవాహన సేవకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరుమలకు శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి పుష్పమాలలు, చెన్నై నుంచి గొడుగులు చేరుకున్నాయి.