యాజమాన్యం వల్లే కార్మికులకు ఇబ్బందులు
ఆదిలాబాద్, అక్టోబర్ 31 : సింగరేణిలో యజమాన్యం రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఐఎన్‌టియుసి గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ వెంకటరావు ఆరోపించారు. ఈ ఏడాది జిల్లాలోని సింగరేణిలో పది సంఘటనల్లో 12 మంది కార్మికులు మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. బొగ్గు గనుల్లో రక్షణ చర్యలు కరువైయ్యాయని ఆయన ఆరోపించారు. 2007లో ఢిల్లీలో జరిగిన కేంద్ర రక్షణ ద్వై పక్షిక సమావేశంలో బొగ్గు గని ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించి ఐదేళ్లు గడుస్తున్న సింగరేణి ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సింగరేణిలో జరిగే రక్షణ ద్వై పక్షిక సమావేశాల్లో రక్షణ చర్యలపై చర్చించి సమీక్షించాలని ఆయన అన్నారు. సింగరేణి యజమాన్యం ఆలక్ష్యం కారణంగా కార్మికులు మరణిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సారి జరిగే రక్షణ సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.