యుద్దాలకు కాలం చెల్లింది
ప్రపంచ దేశాలు పరస్పర ఆశ్రితాలు
ఉక్రెయిన్‌పై దాడిపట్ల దలైలామా ఆందోళన
న్యూఢల్లీి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగడంపై దలైలామా సోమవారం స్పందించారు. మన ప్రపంచం చాలా పరస్పర ఆధారితంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణ అనివార్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని
తెలిపారు. యుద్ధం అనేది పాతదని, అహింస మాత్రమే సమస్యలకు పరిష్కార మార్గమని అన్నారు. అందరినీ సోదర, సోదరీమణులుగా భావించాలని, మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించు కోవాలని సూచించారు. అప్పుడే మనం మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించగలమని వ్యాఖ్యా నించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల పరిష్కారానికి దలైలామా కొన్ని సూచనలు చేశారు. సమస్యలు, విభేదాలను చర్చల ద్వారా ఉత్తమంగా పరిష్కరించుకోవచ్చని పునరుద్ఘాటించారు. పరస్పర అవగాహన కలిగి ఉండటం, ఒకరి శ్రేయస్సును మరొకరు గౌరవించడం ద్వారా నిజమైన శాంతి ఏర్పడుతుందని అన్నారు. ’మనం ఆశ కోల్పోకూడదు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయం. 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలి’ అని తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.కాగా, టిబెటన్ల అణిచివేత, చైనా కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన దలైలామా 1959లో టిబెట్ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.