యువకుడి సాహసం..అభినందించిన పోలీసులు
కడప,జూలై17(జనం సాక్షి): ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఎఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో సఓమవారం జరిగిన గ్యాస్ సిలిండర్ అగ్ని ప్రమాదం సంఘటనలో సమయానికి స్పందించి గ్యాస్ సిలిండర్లను బయటకు తెచ్చి పెను ప్రమాదం నుంచి కాపాడిన అదే గ్రామానికి చెందిన ఖాజా మస్తాన్ అనే యువకుడ్ని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుసేన్, ఎఎస్ పేట మండల ఎస్సై వీరనారాయణలు మంగళవారం అభినందించారు. వంట గదిలో సిలిండర్ గ్యాస్ లీక్ అయ్యి చెలరేగిన మంటలకు భయపడకుండా సమయానికి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ను,గృహస్తురాలను బయటికి తీసుకురావడంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఖాజామస్తాన్ అనే యువకుడు చొరవ చూపిన విషయాన్ని తెలుసుకున్న ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుసేన్, ఎఎస్ పేట ఎస్సై వీరనారాయణలు ఆ యువకుడిని తమ కార్యాలయానికి పిలిపించి అభినందిస్తూ సరైన సమయానికి స్పందించినందుకు తమ సొంత నిధులతో గోడ గడియారాన్ని బహూకరించారు. ఏవైనా ప్రమాదకర పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఖాజామస్తాన్ లాగా చొరవ చూపితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగినవారవుతారని సిఐ అల్తాఫ్ హుసేన్ అన్నారు.