యూటర్న్‌ తీసుకుంది భాజపానే

– ఇచ్చిన హావిూలు కేంద్రమే మర్చిపోతే ఎలా?
– టీడీపీది ఎప్పుడూ సరైన దారే
– విశాఖ – చెన్నై కారిడార్‌ను కేంద్రం గాలికొదిలేస్తోంది
– ఏపీకి న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదు
– బీజేపీ అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
– పార్లమెంటులో ఎంపీల పోరాటానికి ప్రశంసలు వస్తున్నాయి
– ఇదే స్ఫూర్తితో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లండి
– టీడీపీని దెబ్బతీసేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి
– ఏపీ ప్రయోజనాలను గాలికొదిలేశాయి
– ఒంగోలు ధర్మపోరాటం రోజు మరోచోట పోటీ దీక్ష చేయిస్తారా
– టెలీకాన్ఫరెన్స్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, జులై27(జ‌నంసాక్షి) : విభజన హావిూల విషయంలో భాజపానే యూటర్న్‌ తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తమది ఎప్పుడూ సరైన దారేనని స్పష్టంచేశారు. టీడీపీ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  పార్లమెంటులో ఎంపీల పోరాటంపై ప్రజల్లో ప్రశంసలు వచ్చాయన్నారు. ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ఎంపీలు అత్యున్నత చట్టసభల్లో ఎండగట్టారని.. తమకు అప్పగించిన బాధ్యతను పకడ్బందీగా నిర్వర్తించారని కొనియాడారు. ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం, మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, పదేళ్లు ¬దా ఇస్తామని చెప్పి… ఇప్పుడు కుదరదని చెప్పడం.. ఇవన్నీ భాజపా యూటర్న్‌ తీసుకుందనటానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌పై శ్రద్ధ చూపిస్తున్న కేంద్రం.. విశాఖ-చెన్నై కారిడార్‌ను గాలికొదిలేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం వంటివి యూ టర్న్‌ కాక మరేంటని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శూన్యగంట, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఒంటెత్తు పోకడలకు పాల్పడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. భాజపా అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారు. ఇదే పోరాటాన్ని ఇకపై కూడా కొనసాగించాలని సూచించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. భాజపా చేసిన అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ప్రజాక్షేత్రంలో కేంద్రం చర్యలను ఎండగట్టాలని తెలిపారు. ఒంగోలులో ధర్మపోరాట సభకు ఎంపీలందరూ హాజరుకావాలని ఆదేశించారు. ఎంపీలు చేసిన పోరాటానికి ప్రజా స్పందన గమనించి భవిష్యత్‌ పోరాటానికి మరింత ఉత్తేజితులు కావాలని దిశానిర్దేశం చేశారు. తెదేపాను దెబ్బతీయడానికి మూడు పార్టీలు లాలూచీ పడి కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పోరాటం పెంచినప్పుడల్లా లాలూచీ పరులతో పోటీ కార్యక్రమాలు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటీ దీక్షలు చేస్తున్నారని.. దీన్ని బట్టే భాజపా, వైకాపా, జనసేన పార్టీల లాలూచీ తెలుస్తోందని.. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

తాజావార్తలు