యూపిఐ తరహాలో యూఎల్‌ఐ సేవలు

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక
ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడి
బెంగళూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో కొత్తతరహా సేవలకు నాంది పలకనుంది. రుణాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడం కోసం యూనిఫైడ్‌ లెండిరగ్‌ ఇంటర్‌ఫేస్‌ ను జాతీయస్థాయిలో త్వరలో లాంచ్‌ చేయనుంది. గతేడాదే ’ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌’ పేరిట పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఆర్‌బీఐ.. అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో యూపీఐ ఏవిధమైన పాత్ర పోషిస్తోందో.. రుణ వితరణలో యూఎల్‌ఐ కూడా అదే పాత్ర పోషించబోతోంది. దేశ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక నిర్వహించబోతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు. భూ రికార్డులు మొదలుకొని, ఇతర ముఖ్యమైన డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా యూఎల్‌ఐ పనిచేస్తుందని చెప్పారు. దీనివల్ల రుణ ఆమోద పక్రియ సరళతరం కానుందని తెలిపారు. రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్‌ పక్రియ అవసరం ఉండదని శక్తికాంతదాస్‌ వివరించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 17న ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌ పేరిట పైలట్‌ ప్రాజెక్ట్‌ను లాంచ్‌ చేశారు. ఆర్‌బీఐకి చెందిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా దీన్ని చేపట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు సెకన్లలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వచ్చినయూపిఐ చెల్లింపు వ్యవస్థ విజయవంతమైంది.
ఈ నేపథ్యంలో రుణ ఆమోదం వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుందని, తద్వారా చాలా తక్కువ సమయంలో ప్రజలకు రుణాలు ఇవ్వబడతాయన్నారు. తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారు దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారని గవర్నర్‌ అన్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ తర్వాత యూనిఫైడ్‌ లెండిరగ్‌ ఇంటర్‌ఫేస్‌ ని త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో బహుళ డేటా ప్రొవైడర్‌లతో పాటు రుణ సంస్థలు వివిధ రాష్టాల్ర భూ రికార్డులను కూడా కలిగి ఉంటాయన్నారు. దీని ద్వారా మరింత డిజిటల్‌ సమాచారం అందుబాటులో ఉంటుందని శక్తికాంత దాస్‌ చెప్పారు. దీంతో చిన్న, గ్రావిూణ ప్రాంతాల వ్యక్తులకు తక్కువ సమయంలో సులభంగా రుణాలు ఇవ్వవచ్చన్నారు. ఈ వ్యవస్థ ద్వారా భారీ డాక్యుమెంటేషన్‌ నుంచి బయటపడతారని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్‌ఎస్‌ఈ రంగానికి సంబంధించిన వ్యక్తులు రుణం తీసుకోవాలనుకునే వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.